YSRCP Government Closing Aided Schools : గత విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి చేరలేదని పేర్కొంటూ ఉమ్మడి 11 జిల్లాల్లో 76 పాఠశాలల తనిఖీలకు ఆదివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపివేసి, అనుమతిని రద్దు చేయనుంది. శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఈ పాఠశాలలు ఉన్నాయి. మూతపడే బడుల్లో పశ్చిమగోదావరిలో అత్యధికంగా 34 ఉండగా ఆ తర్వాత స్థానంలో 13 పాఠశాలలతో ప్రకాశం ఉంది. ఈ పాఠశాలలన్నీ సున్నా ప్రవేశాలతో కొనసాగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
విద్యా చట్టం ప్రకారం వీటికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపివేయడంతో పాటు గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయనుంది. వీటిల్లో పని చేస్తున్న టీచర్లను ఇతర బడులకు సర్దుబాటు చేయనుంది. ఈ పాఠశాలలను పరిశీలించి, చుట్టుపక్కల ఉన్న బడులు, విద్యార్థుల అవసరాలను పరిశీలించాలని జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది.
ఎయిడెడ్ విద్యావ్యవస్థకు చరమగీతం.. ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు
Aided Schools Situation in AP : ఎయిడెడ్ బడులపై జగన్ ప్రభుత్వం మొదటి నుంచి కక్ష సాధింపుతోనే వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్లో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, ప్రైవేటుగా నిర్వహించుకోవచ్చని, లేదంటే ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయి అధికారులు ఎయిడెడ్ యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ బడులు ప్రైవేటుగా మారిపోతే ఫీజులు చెల్లించాల్సి వస్తుందని పేద విద్యార్థులు, వారి తల్లితండ్రులు రోడ్డెక్కడంతో ఎయిడెడ్లో కొనసాగితే కొనసాగొచ్చనే మరో అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి ఏదో విధంగా వీటిని మూసివేసేందుకు ఒత్తిడి చేస్తూనే ఉంది. నియామకాలు చేపట్టకుండా నిలిపివేసింది. కొత్త నియామకాలు మొదట మూడేళ్లకు ఒప్పంద ప్రాతిపదికనే నియమించుకోవాలనే ఆదేశాలు ఇచ్చింది. మిగులు ఉన్న చోట నుంచి సర్దుబాటు చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలంటూ హెచ్చరించింది.
Education System in AP: ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాలు నిలిపివేసిన ప్రభుత్వం ఆ తర్వాత మౌలికసదుపాయాలు లేవని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎయిడెడ్ బడుల్లో మౌలికసదుపాయాల కొరత, 40మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న వాటిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. విద్యార్థుల సంఖ్య పెంచుకోకపోతే మూసివేస్తామంటూ 2022లో హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 418 బడుల్లో 40మందిలోపు పిల్లలు ఉన్నట్లు గతంలో ప్రభుత్వం పేర్కొంది. అవకాశం కల్పించినా విద్యార్థుల సంఖ్య పెరగలేదని, వీటిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిల్లో కొన్ని బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం, మరికొన్ని అభ్యర్థించడంతో అప్పట్లో కొన్నింటికి మినహాయింపునిచ్చింది. గతేడాది డిసెంబరులో మళ్లీ నిబంధనల కత్తి బయటకు తీసింది. మౌలిక సదుపాయాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపై తనిఖీలు చేయించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడు మళ్లీ మూసివేత చర్యలను వేగవంతం చేసింది.
Aided schools: ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం