YSRCP Followers Attack on Dalits: గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని కంతేరులో గురువారం ఉదయం స్థానికులకు.. పారిశుద్ధ్య కార్మికుడైన ట్రాక్టర్ చోదకుడికి వాగ్వాదం జరిగింది. ట్రాక్టర్ చోదకుడికి మద్దతుగా వైఎస్సార్సీపీకి చెందిన దళితులు మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన కళ్లం హరికృష్ణారెడ్డి, తన వర్గీయులతో కలిసి దళితులపై గొడవకు దిగారు. ఈ గొడవలో దళితులపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ కేసులో భాగంగా కంతేరులో శనివారం సాయంత్రం పోలీసులు పర్యటించారు.
బాధితులకు న్యాయం చేస్తాం.. పోలీసుల హామీ : దళితులపై జరిగిన దాడి గురించి శనివారం డీఎస్పీ పోతురాజు బాధితులను విచారించారు. ముందుగా వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. స్టేషన్లో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. చావు దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కు వస్తేనే న్యాయం జరగలేదని, విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లే ఏదైనా జరిగితే ఎవరు భాద్యత వహిస్తారని వాపోయారు.
గ్రామంలోనే విచారించాలని బాధితుల బంధువులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఒంటరిగా కార్యాలయంలోకి తీసుకువెళ్లడానికి వీల్లేదంటూ దళితులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు గేట్లు మూసి విచారణకు సహకరించాలని కోరారు. అనంతరంం స్థానిక సచివాలయంలో విచారించారు. సచివాలయం ఆవరణలో బాధితుల్లో ఒకరైన వంశీని విచారించారు. దాడికి పాల్పడిన కళ్లం మనోహర్ రెడ్డి అతని అన్న హరినాథ్రెడ్డిని నిందితులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత బంధువులు పోలీసుల ఎదుట నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ : కంతేరు దళితులపై దాడికి పాల్పడిన కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.దళితలపై అత్యంత దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాలలను కించపరిస్తే ప్రతి దాడి తప్పదు : తాడికొండ మండలం కంతేరులో శనివారం రాత్రి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కంతేరు గ్రామానికి చెందిన దళితులపై అదే గ్రామంలోని ఒక సామాజిక వర్గం దాడి చేసి జరిగిందని తెలిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కంతేరులో మాలలను కించపరిచి మాటాడితే ప్రతి దాడి తప్పదని ఆయన హెచ్చరించారు. స్థానిక నాయకులు, మంత్రులు ఇంత వరకు బాధితులును పరామర్శించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మాలలు తరుపున పోరాటం చేస్తుంటే పార్టీలు అంట కడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.