YSRCP Corporators Illegally Collecting Money: ఫీజులు ఫీజులే.. మామూళ్లు మామూళ్లే అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ఒంగోలు, అనంతపురం వంటి నగరాల్లో కొందరు కార్పొరేటర్లు బాహాటంగానే అక్రమ వసూళ్లు చేస్తున్నారు. 150 నుంచి 250 మీటర్లలోపు నిర్మిస్తున్న ఇళ్లు, భవనాలకు కనిష్ఠంగా 15 వేల రూపాయల నుంచి లక్ష, అంతకు మించిన విస్తీర్ణంలో నిర్మిస్తున్నవారి నుంచి 2 లక్షల రూపాయలు నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికార వైసీపీ కార్పొరేటర్లు కొందరు తమ డివిజన్ల పరిధిలో కొత్త నిర్మాణం ఎవరు మొదలెట్టినా అక్కడికి వెళ్లి కమీషన్ల కోసం పట్టుబడుతున్నారు. ఇవ్వకపోతే ఏదో ఒక వంకతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పనులు అడ్డుకుంటున్నారు. నెల్లూరులోని ప్రధాన కూడలిలో ఒక వ్యాపార సంస్థ పక్కన చేపట్టిన భవన నిర్మాణంపై అధికార పార్టీ కార్పొరేటర్ ఒకరు సంబంధిత యజమానిని ముప్పుతిప్పలు పెట్టి మరీ సొమ్ము వసూలు చేశారు. కార్పొరేటర్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సదరు బాధితుడు స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినా ఉపయోగం లేకపోయింది.
కార్పొరేటర్లతో ప్లానింగ్ కార్యదర్శుల కుమ్మక్కు!: గుంటూరు, విజయవాడ, విశాఖ నగరపాలక సంస్థల్లో సచివాలయాల్లోని కొందరు వార్డు ప్లానింగ్ కార్యదర్శులు కార్పొరేటర్లతో కుమ్మక్కవుతున్నారు. కొత్త నిర్మాణం కోసం తమ లాగిన్‌కు వచ్చే ప్రతి అప్లికేషన్‌ను ప్లానింగ్ కార్యదర్శులు పరిశీలించాలి. వారే భవన యజమానులను పిలిపించి, కార్పొరేటర్లను కలవాలని సూచిస్తున్నారు. కార్పొరేటర్ అడిగినంత డబ్బు ఇవ్వడానికి దరఖాస్తుదారులు అంగీకరిస్తే ప్లానింగ్ కార్యదర్శులు తన లాగిన్‌లోని అప్లికేషన్లో అన్ని వివరాలూ సక్రమంగా ఉన్నట్లు వెంటనే ధ్రువీకరిస్తున్నారు. లేదంటే సమగ్ర వివరాలు లేవని, సరైన డాక్యుమెంట్లు జత చేయలేదని జాప్యం చేస్తున్నారు.
ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. అప్పటికి ఆమోదించి తరువాత కార్పొరేటర్లకు సమాచారాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్లు వేధింపుల్లో మరో కోణాన్ని బయటికి తీస్తున్నారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించేవరకు వేచి చూసి.. ఆ తర్వాత రోడ్లపై నిర్మాణ సామగ్రి వేస్తూ రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారని మరోసారి ఫిర్యాదులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. నిర్మాణ పనుల వల్ల ఇళ్లలోకి దుమ్ము, ధూళి వస్తోందని చుట్టుపక్కలవారితోనూ ఫిర్యాదులు చేయిస్తున్నారు. ప్లానింగ్ కార్యదర్శులను కూడా పంపించి భవన యజమానులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
భౌతిక దాడులకు దిగుతున్నారు: ప్లానింగ్ కార్యదర్శులు.. కార్పొరేటర్లు చెప్పినట్లు వినకపోయినా.. నిబంధనల ప్రకారమే పని చేస్తున్నా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప నగరపాలక సంస్థలో అనుమతుల్లేకుండా భవనాలు నిర్మిస్తున్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన ప్లానింగ్ కార్యదర్శిపై అధికార వైసీపీ కార్పొరేటర్ అనుచరులు ఇటీవల దాడి చేశారు. నగరాల్లో చేపట్టే అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు అనుమతుల విషయంలో కొందరు కార్పొరేటర్లు భారీగా వసూళ్లు చేస్తున్నారు. 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌కు 5 లక్షలు, అంతకు మించితే 8 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పట్టణ ప్లానింగ్ అధికారులు సైతం ఈ విషయంలో కార్పొరేటర్లు, బిల్డర మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.
విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలైన ఎండాడ, మధురవాడ, కొమ్మాది, గాజువాక, పెందుర్తి తదితర ప్రాంతాల్లో కొందరు పట్టణ ప్రణాళిక అధికారులే బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేటర్లకు అందిస్తున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు సంబంధించి బిల్డర్ల నుంచి పట్టణ ప్రణాళిక అధికారులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన ఓ వైసీపీ ప్రజాప్రతినిధి అండతో పట్టణ ప్రణాళిక అధికారులు వసూళ్ల విషయంలో తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.