YSR Sanchara Pashu Arogya Seva in AP: పశువులకూ మొబైల్ అంబులెన్సు సేవలను అందించే.. సంచార పశువైద్య సేవలనూ వైసీపీ ప్రభుత్వం అటకెక్కిస్తోంది. వాస్తవానికి గతంలోనే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలోనే తామే మొట్టమొదటిగా ప్రారంభించామని డప్పు కొట్టుకున్న జగన్.. ఇప్పుడు పథక నిర్వహణను గాలికొదిలేశారు.
ప్రారంభించి రెండేళ్లు గడవక ముుందే ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులూ చాలా చోట్ల లభించడం లేదు. చాలా వాహనాలు ఇప్పటికే మూలకు చేరుతుండగా.. ఉన్నవాటిలోనూ హైడ్రాలిక్ పరికరాలు పనిచేయడం లేదు. వాటి మరమ్మతులకు నెలలు పడుతోంది. జగన్ సొంత జిల్లాలోనే చాలాచోట్ల వాహనాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో మూగజీవాలకు వైద్యసేవలు కుంటుపడుతున్నాయి.
రాష్ట్రంలో బేబీ కిట్ పథకానికి బై బై-ఎందుకు ఆగిందో జగన్‌కే తెలియాలి?
వైసీపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ సంచార పశువైద్య సేవలను 2022 మే నెలలో ప్రారంభించింది. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 అంబులెన్సు సేవల్ని అమల్లోకి తీసుకురాగా.. ఈ ఏడాది జనవరిలో 165 వాహనాలను ప్రారంభించారు. ఇందుకు 2 వందల40 కోట్లకు పైగా వ్యయం చేసినా.. సేవలు సరిగా అందట్లేదు. దీంతో పశువుల చనిపోయి.. రైతులు భారీగా నష్టపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ పథకంలో పనిచేస్తున్న తమకు జీతాలు సరిగా చెల్లించట్లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం వైద్యుడికి 57 వేలు చెల్లించాల్సి ఉండగా.. 35 వేలు మాత్రమే ఇస్తున్నారు. వేతనాలు ఇవ్వాలంటూ సమ్మె చేసిన సిబ్బందికి నోటీసులిచ్చి వేతనంలో కోత పెడుతున్నారు.
అత్యవసర పశు వైద్య సేవలకు ఉపయోగపడే మొబైల్ అంబులెన్సులో వైద్యుడు, పారావెట్, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారు. 1962 నంబరుకు కాల్ చేస్తే వెంటనే వాహనం నిర్దేశిత ప్రాంతానికి వస్తుంది. పశువుకు హిస్టరెక్టమీ సహా పలు శస్త్ర చికిత్సలు, 20 రకాల పేడ పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా 54 రకాల పరికరాలు, మినీ ఫ్రిజ్ ఈ వాహనంలో ఉంటాయి.
ప్రతి అంబులెన్సులో మొత్తం 35 వేల రూపాయల విలువైన 81 రకాల మందుల్ని అందుబాటులో ఉంచాలి. కదల్లేని స్థితిలో ఉన్న పశువులను హైడ్రాలిక్ సాయంతో వాహనంలోకి ఎక్కించి.. దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి.. తిరిగి రైతు ఇంటివద్ద దింపి వెళ్లడం ఈ అంబులెన్సు సేవల ప్రత్యేకత. అందించే సేవల జాబితా గొప్పగా ఉన్నా.. ఇవేవీ అందుబాటులో ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంబులెన్సుల్లో 81 రకాలు కాదు కదా.. ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులూ లభించట్లేదు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నా.. పట్టించుకునే నాథులే లేరు. పశువుల్లో తరుచూ తలెత్తే జ్వరం, మేత మేయకపోవడం, అరుగుదల వంటి సమస్యలకు సంబంధించిన మందులు, పెయిన్ కిల్లర్స్ దొరకట్లేదని రైతులు వాపోతున్నారు.
మూలనపడ్డ వాహనాలు: అంబులెన్సు వాహనాలు క్రమంగా మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని షెడ్లకు పంపి మిన్నకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు వాహనాలు మరమ్మతులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలోనూ కొన్నిచోట్ల వాహనాలు తిరగడం లేదు. కొన్ని వాహనాల్లో హైడ్రాలిక్ వ్యవస్థ దెబ్బతినడంతో పశువుల్ని వాహనాల్లో తరలించడం లేదు. వాటి మరమ్మతులకు అవసరమైన కొద్దిపాటి మొత్తాన్ని కూడా నిర్వహణ సంస్థ చెల్లించడం లేదు. దీంతో అవి షెడ్లకే పరిమితమవుతున్నాయి.
మొత్తంగా మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏర్పాటైన పథకం అమలు నామమాత్రంగా తయారై.. అన్నదాతలకు తీరని వేదన మిగుల్చుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం పశువుల ఆసుపత్రి ప్రాంగణంలోనే నెల రోజులుగా వెహికల్ మూలన పడి ఉంటోంది. వైద్యుడు, డ్రైవర్ లేకపోవడంతో దీన్ని బయటకు తీయడం లేదు. అత్యవసరమైతే ముత్తుకూరు, పొదలకూరు నుంచి వాహనాలను పిలిపిస్తున్నామని అధికారులు వివరించారు.
YSR Yantra Seva Scheme మాదే ప్రభుత్వం.. మాకే యంత్రాలు..! ఇదే గ్రామస్వరాజ్యం అంటున్న జగన్..