గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో విక్రయాలు నిలిచిపోయాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారులు పసుపు కొనేందుకు ముందుకు రావటం లేదు. వారం పాటు యార్డు మూసివేస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకూ దుగ్గిరాలలో 22 కేసులు నమోదు కాగా.. మండలంలో మొత్తం 48 మందికి కొవిడ్ పాజిటివ్‌గా అధికారులు తేల్చారు. పలు ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, పసుపు మార్కెట్ యార్డు సమీపంలో కంటెయిన్మెంట్ జోన్ ఉండటం వంటి కారణాలతో.. పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరూ రావడం లేదు. ఈ కారణంగా.. యార్డును కొన్ని రోజులపాటు తాత్కాలికంగా మూసివేసిస్తున్నట్లు అధికారులు నిర్ణయించారు.
ఇక... దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా కొన్ని రోజులు తాత్కాలికంగా మూతపడింది. కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన పరిస్థితుల్లో.. శనివారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యాలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆఫీసు తెరిచే అవకాశముంటుందని, ప్రస్తుతం సిబ్బంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. గురువారం సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న జలవనరులశాఖ డీఈఈ కార్యాలయాన్ని కూడా ముందుజాగ్రత్తగా మూసివేశారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన తర్వాత తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: