రెండు సంవత్సరాల క్రితం జరిగిన గొడవను మనసులో పెట్టుకొని వైకాపా నేతలు తనపై దాడికి దిగారంటూ... గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన గోపి ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
రెండు సంవత్సరాల క్రితం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైకాపా నేతలకు తెదేపా కార్యకర్తలకు వివాదం జరిగింది. అప్పుడు తెదేపా కార్యకర్తను వైకాపా నేతలు వల్లంశెట్టి వెంకటేశ్వర్లు, వెంకట్ తదితరులందరూ దాడి చేసి గోదాంలో దాచి పెట్టారని గోపి ఆరోపించారు. ఆ యువకుడిని తాను బయటకు తీసుకొచ్చానని గోపి వివరించారు. దీంతో వైకాపా నేతలంతా తనపై కక్షకట్టారని ఆరోపించారు.
ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నారనీ... లాక్డౌన్ వలన ఇంటికి వచ్చినట్లు గోపి వివరించారు. ఆదివారం స్థానికంగా జరిగిన తిరునాళ్లలో వైకాపా నేతలు వెంకటేశ్వర్లు, వెంకట్ ఇతర అనుచరులు తనపై దాడికి చేశారని ఆరోపించారు. వారంతా దుర్భాషలాడుతూ, ప్రభుత్వం తమదేనని తాము ఏం చేసినా పడి ఉండాల్సిందేనని హెచ్చరించారని వాపోయారు. తనను వారి నుంచి కాపాడాలని గోపి వేడుకుంటున్నారు.
ఈ విషయంపై డీఎస్పీ శ్రీనివాసరావును వివరణ అడగ్గా... గోపి ఎవరిపైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదన్నారు. కేవలం పాత కక్షల కారణంగా ఈ వివాదం జరిగిందన్నారు. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదని తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి