YSRCP Govt Double Stance: "మూడో తరగతి నుంచే ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి అడుగులు ముందుకు పడుతున్నాయి” అంటూ ముఖ్యమంత్రి జగన్ గొప్పగా ప్రకటించారు. అలాగే విద్యాశాఖ మంత్రి బొత్స.. రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులను వేరే బడుల్లో చేర్పించుకోవాలన్నారు. ఇది ఆదేశం కాదని.. విద్యార్థుల తల్లిదండ్రులకు అభ్యర్థన అంటూ చెప్పుకొచ్చారు.
ఈ పాఠశాలల్లో చదువుతున్న వారికి మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేక పోతుండటంతో.. సబ్జెక్టు టీచర్లు ఉన్న బడుల్లో చేర్పించాలని సూచించారు. కానీ తాజాగా ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. 98 మందిలోపు విద్యార్థులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 30 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఇక్కడ గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఇస్తామని చెప్పింది. అదే సమయంలో 30 మంది లోపు ఉంటే ఒకే స్కూల్ అసిస్టెంట్‌ను మాత్రమే కేటాయిస్తామంటూ నిబంధన పెట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల బోధన అంశంలో నిబంధనలు విద్యార్థులకు కష్టతరంగా మారుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి లోపమే కారణం. సబ్జెక్టు టీచర్ల నియామకంపై ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి జగన్ అనంతరం దీనిపై దృష్టి నిలపడం లేదు. మరోవైపు విద్యా శాఖ మంత్రి ప్రకటనలు, ప్రభుత్వ తాజా ఉత్తర్వులు ముఖ్యమంత్రి హామీకి భిన్నంగా ఉండటం వైసీపీ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, హిందీతో సహా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాఠశాలల్లో స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉంటేనే సబ్జెక్టు టీచర్లను కేటాయిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలను మార్చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో ఒకే విధానం అమలు కావాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరుగుతోంది. 98 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కన్నా ఎక్కువ మంది ఉంటేనే గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టు టీచర్లను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
పేద విద్యార్థులు చదివే ఈ స్కూల్స్‌లో ప్రభుత్వం రెండు విధానాలను అవలంబిస్తోంది. ' నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేదవారు' అంటూ ప్రతి ప్రసంగంలో ఆర్భాటంగా చెప్పే ముఖ్యమంత్రి జగన్.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సబ్జెక్టు టీచర్లను వారికి దూరం చేస్తే నాణ్యమైన విద్య ఎలా అందుతుంది?. రాష్ట్రంలో 98 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 13 వందల 64 ఉన్నాయి. వీటిలో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 484 ఉన్నాయి. ఇక్కడ సామాన్యశాస్త్రం, గణితం, ఆంగ్ల సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఇస్తే తెలుగు, హిందీ, సోషల్ను సెకండరీ గ్రేడ్ టీచర్లతో బోధిస్తారు.
ఎనిమిదో తరగతిలోపు పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోతే పైతరగతుల్లో రాణించలేరు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది అక్కడి టీచర్ల బోధనపైనే ఆధారపడతారు. కొన్ని సబ్జెక్టులకు సరైన బోధన లేకపోతే వారి భవిష్యత్తు ఏమవుతుంది ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని సాధించేందుకు టోఫెల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. నాణ్యమైన విద్యా బోధనపై మాత్రం దృష్టి నిలపడం లేదు.
6, 7, 8 తరగతుల్లో 30 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 880 ఉన్నాయి. ఇక్కడ ఏకంగా ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్ తో పాటు ఒకే ఒక్క ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్ ఇస్తోంది. 6 నుంచి 10 తరగతుల వరకు ఒక్కో గదికి ఒక్కో ఐఎఫ్పీను ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. విద్యార్థులు అందరికీ డిజిటల్ విద్య ఎలా అందుతుంది ? అన్న విషయాన్ని ఆలోచించడం లేదు. ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్, ఐఎఫ్పీతో ఇక్కడ చదివే వారు గ్లోబల్ విద్యార్థిగా ఎలా ఎదుగుతారో ముఖ్యమంత్రి జగన్‌కే తెలియాలి మరి.
మూడో తరగతి నుంచి విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా 6,7,8 తరగతులంటూ కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పేదలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇలా రెండు పద్ధతులు పాటిస్తూ కొందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం దూరం చేస్తోంది. వాస్తవంగా ఈ బడులను సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం.. వాటి సమీపంలో బడులు లేకపోవడంతో భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా చేస్తుందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.