ప్రశ్న... బ్లీచింగ్ పౌడర్ సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు?
యరపతినేని... ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బ్లీచింగ్ పౌడర్ కంపెనీ పెట్టి... ముగ్గుపొడిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేశారు. తూర్పుగోదావరి, నెల్లూరు, కృష్ణా, విజయనగరం, చిత్తూరు జిల్లాలకు గుంటూరు జిల్లా నుంచి బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేశారు. అయితే అందులో నాణ్యత లేదని అక్కడి అధికారులు గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. విచారణకు ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాత్ర ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణపై మాకు నమ్మకం లేదు. సీబీఐ విచారణతోనే వాస్తవాలు తెలుస్తాయి. అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.
ప్రశ్న... నాసిరకం బ్లీచింగ్ పౌడర్ సరఫరాకు సంబంధించి మీ వద్ద శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయా?
యరపతినేని... అధికారులు ఆర్డర్ ఇచ్చింది బ్లీచింగ్ పౌడర్... కానీ సరఫరా చేసిన బ్యాగులపై ఉన్నది వేరే పౌడర్ అని ముద్రించారు. సంచుల లోపల మాత్రం ముగ్గు పొడి ఉంది. విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే పిడుగురాళ్లలోని తయారీ కంపెనీని తగలబెట్టారు. ఆధారాలు నాశనం చేసేందుకే ఇలా చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు, ప్రజలకు ద్రోహం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రశ్న.... ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ప్రతినిథులు రూ. 2 కోట్ల ఆర్డర్ మాత్రమే వచ్చిందని... అధికారులు కోరిన విధంగా పౌడర్ సరఫరా చేశామని అంటున్నారు. మీరు వందల కోట్ల అక్రమాలని అంటున్నారు. ఏది నిజం?
యరపతినేని... తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రాసిన లేఖలో 70 కోట్ల సరకు నాణ్యత లేనిదని పేర్కొన్నారు. ఇంకా వేరే జిల్లాలు ఉన్నాయి. తెలంగాణకు సరఫరా చేసిన వివరాలు రావాల్సి ఉంది. ఇంకా పంచాయతీలకు కూడా ఇచ్చారు. ఈ లెక్కలన్నీ తేలాలి. ఎంత పంపారు. ఎంత ఆపారు ఆ లెక్కలన్నీ తేలాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేం నిష్పాక్షిక విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రశ్న... ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయపోరాటం చేస్తారా?
యరపతినేని... జాతీయ విపత్తను కాసుల కోసం ఉపయోగించుకోవటం దారుణం. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం. ప్రభుత్వం అలా చేయకపోతే మేం కోర్టులో కేసు వేస్తాం. దోషులకు శిక్ష పడేలా చేస్తాం.
ప్రశ్న... కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?
యరపతినేని... మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేంద్రం ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలి. మేం కూడా ఈ వ్యవహారాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తాం.
ఇవీ చదవండి.. స్వస్థలాలకు 1400 మంది బిహార్ వలస కార్మికుల పయనం