మహిళలను బెదిరించి వారి దగ్గర ఉన్న నగదును దోచుకెళ్తున్న దొంగల ముఠాను గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి లక్ష 47 వేల నగదు, బ్లేడ్, చాకులను స్వాధీనం చేసుకున్నారు.
డబ్బుల కోసం గుంటూరుకు..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకు చెందిన జింకా రాజేశ్వరి వ్యవసాయ పనుల నిమిత్తం డబ్బులు అవసరమై గుంటూరు జిల్లా కేంద్రానికి వచ్చారు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రూ. 2 లక్షల 50 వేల నగదు తీసుకున్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరే ముందు దుకాణంలో పండ్లు కొంటుండగా గుర్తు తెలియని మహిళలు సంచిని కత్తిరించి నగదును దోచుకెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు..
బాధితురాలు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లాలాపేటలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలంలో నిఘా ఉంచి.. మరో దొంగతనం చేయడానికి మహిళా ముఠా సిద్ధపడగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు పాత నేరస్తులే..
నిందితులు కావటి వరలక్ష్మి, పులి కల్యాణి, సాతుపాటి నాగమ్మలను కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ ఫిరోజ్ వెల్లడించారు. గతంలో వీరిపై ప్రకాశంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు సీఐ స్పష్టం చేశారు.