గుంటూరులోని ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇంటికి, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఓ యువతి హత్య జరగడం దారుణమని తెదేపా మహిళా రాష్ట్ర అధ్యక్ష్యురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతుందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా ముఖ్యమంత్రి, మహిళా హోంమంత్రి మహిళలపై దాడుల్ని నివారించటం లేదని అనిత దుయ్యబట్టారు. దిశా పోలీసులు ఏమయ్యారని, దిశ చట్టాన్ని ఏ మూలన కూర్చోబెట్టారని నిలదీశారు.
ఆ చట్టం వైసీపీ నేతలకు చుట్టమా అని ఆక్షేపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలు నేరస్థులను శిక్షించేలా కాకుండా వారిని ప్రోత్సహించేలా ఉన్నాయని అనిత దుయ్యబట్టారు. వైకాపా పాలనలో నిందితులకు తప్ప బాధితులకు భరోసా లేదని విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందంగా ముస్తాబు చేసిన దిశ శకటాలకు బహుమతులివ్వడం కాదని.. ఆడపిల్లలకు రక్షణ, భరోసా ఇవ్వాలన్నారు.
'దిశాచట్టాన్ని దశలేని చట్టంగా మార్చారు'
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్యను ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రంగా ఖండించారు. దిశా చట్టంతో మహిళా, విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ లేదా అని నిలదీశారు. దిశాచట్టాన్ని దశలేని చట్టంగా మార్చారని దుయ్యబట్టారు. మహిళా హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలో విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ ఏది అని నిలదీశారు. హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి:
Home minister Sucharitha : 'బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం'