నిత్యావసరాల ధరలు పెరిగి, ఆదాయం తగ్గి కరోనా కాలంలో మధ్యతరగతి ఇంటి బడ్జెట్ లెక్కతప్పుతోంది. ఈ తరుణంలో కొద్దిపాటి అవగాహనతో ఖర్చులు తగ్గించుకుని ఉపశమనం పొందవచ్ఛు తక్కువ బడ్జెట్‌లో జీవనం సాగించే మార్గాలను ఆశ్రయించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అవసరం, విలాసం మధ్య తేడాను గమనిస్తే బతుకుబండి సాఫీగా సాగిపోతుంది.
నిత్యా వసరాలు..
కుటుంబ బడ్జెట్ నిర్వహణలో ఇప్పుడు కచ్చితంగా ఆలోచన చేయాల్సిందే. నిత్యావసరాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. పప్పులు, కిరాణా సరకులు బ్రాండెడ్‌కు వెళ్లకుండా విడివిడిగా కొనుగోలు చేస్తే ధర తగ్గడంతో పాటు వీటిపై పన్ను భారం ఉండదు. శుద్ధిచేసి, పాలిష్ చేసిన పప్పులు, పంచదార లాంటి వాటన్నింటిపైనా పన్ను ఉంటుందని గమనించాలి. జీడిపప్పు, బాదం వంటి అధిక ధరలు ఉండేవి కాకుండా.. అవే పోషకాలు ఉండే స్థానికంగా దొరికే పప్పులు వాడుకోవాలి. ఇళ్లు, బహుళ అంతస్థుల భవనాల్లో సైతం బకెట్ తోటలు పెంచుకుని ఆకుకూరలు పండించుకోవచ్ఛు మునగాకు చాలా చౌకగా లభిస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. తెల్లగా మెరిసేలా కనిపించే బ్రాండెడ్ బియ్యం కంటే మిల్లు వద్ద ముతక బియ్యం కొనుగోలు చేయాలి. ధర తక్కువతోపాటు ఆరోగ్యానికి మంచిది.
విద్యుత్తు బిల్లుల్లో..
జిల్లాలో గృహ వినియోగం కనెక్షన్లు మొత్తం 1136840 ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అవసరం మేరకు విద్యుత్తు వినియోగించడం వల్ల పొదుపు పాటిస్తే సొమ్ము ఆదా అవుతోంది. ఇంట్లో మీటరు రీడింగ్ చూసుకుంటూ స్లాబులకు అనుగుణంగా పొదుపుగా వాడుకోవాలి. 100, 200, 300 ఇలా స్లాబు మారే యూనిట్ల వద్దకు వచ్చేసరికి అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలి. తక్కువ స్లాబులో ఉండటం వల్ల రూ.వందల్లో సొమ్ము పొదుపు చేసే వెసులుబాటు కలుగుతుంది. వినియోగించే యూనిట్లు పెరిగేకొద్దీ స్లాబు రేటు పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి.
అదుపే వెలుగు
- ప్రొఫెసర్ ఆంజనేయులు, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి, ఏఎన్‌యూ
గృహిణి నిత్యవసరాలను పొదుపుగా వాడుకుంటూ ఆదా చేసే మార్గాలను అన్వేషించాలి. సీజన్‌లో వచ్చే పళ్లు కాస్త తక్కువ ధరకు వస్తాయి. అవసరాలకు కొనుగోలు చేస్తూనే వాటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు, పిక్నిక్‌లు, వేడుకల్లో ఆడంబరాలు తగ్గించాలి. సాధారణ జీవితం గడపడానికి అలవాటు పడాలి. వస్తువు, సరకు కొనేముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. అవసరమా? ఇప్పుడే కొనాలా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి?..అనేవి ఆలోచించాలి.
అనవసర ఖర్ఛు..
కొన్ని కుటుంబాల్లో నెలవారీ ఖర్చులో కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అనవసర కొనుగోళ్లు ఉంటాయి. పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌కు వెళ్లి డిస్కౌంట్‌లో వస్తున్నాయని కొనుగోలు చేసేవారు ఉన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అప్పటికి భారం అనిపించకపోయినా కష్టకాలంలో ఇబ్బందులు వస్తాయి. వీటివల్ల రూ.1000 నుంచి రూ.2వేల వరకు అదనపు ఖర్చు అవుతుంది. అత్యవసరమైతే తప్ప దుస్తులు, విలాసానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు. అధిక ధర కలిగిన ఫోన్లు, టీవీలు వంటివాటిని కొనుగోలు చేయకపోవడం మంచిది. పర్యటనలు వాయిదా వేసుకోవాలి.ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లకు కొన్నిరోజులు వెళ్లకపోవడం మేలు.
రోజువారీ మందులు
రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత జబ్బులకు దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వాళ్లున్నారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు మందుల ఖర్చు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకూ ఉంటుంది. జనరిక్ మందులను వేసుకుంటే.. నెలవారీ ఖర్చు మూడోంతులు తగ్గుతుంది. కంపెనీల మందులు రూ.100 ఉంటే జనరిక్‌లో రూ.25లకే లభిస్తాయి.జనరిక్ ఔషధాలు అనగానే నాణ్యత లేనివనే అపోహ వీడాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విటమిన్ సి, డి, మల్టీవిటమిన్, జింక్ లాంటివి వాడుతున్నారు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కంపెనీవి కొంటే నాలుగు ట్యాబ్లెట్లు రూ.120 ఉంటే.. జనరిక్‌లో రూ.30 లోపే ఉన్నాయి.
రోజువారీ కూరల్లో..
కూరగాయలు, మాంసాహారాల విషయంలోనూ కొద్దిగా అదుపు ఉండాలి. సీజనల్‌గా వచ్చే కూరగాయల ధరలు తక్కువ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసే ఖరీదైన క్యారెట్, బీట్‌రూట్, బీన్స్, క్యాప్సికం, క్యాబేజీ లాంటి వాటి కంటే స్థానికంగా దొరికే వంగ, బీర, దొండ, బెండ, సొరకాయ లాంటివి తక్కువకు లభిస్తాయి. బయట మార్కెట్ కంటే రైతు బజార్లలోనే ఒకేసారి తీసుకోవాలి. మాంసాహారం ధరలు పెరిగినప్పుడు తగ్గించడం మంచిది.
* నెలకు కూరల కోసం అయ్యే ఖర్చు: రూ.2 నుంచి 4 వేలు
* అవగాహనతో కొనుగోలు చేస్తే ఆదా: రూ.500 నుంచి రూ.1500.
కొంచెం తెలివి ఉంటే చాలు..
ప్రస్తుత కష్ట కాలంలో.. క్లిష్ట పరిస్థితుల్లో మన బడ్జెట ఎలా ఉండాలనే అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలి. విలాసాలకు ముందుగా కత్తెర వేయాలి. తర్వాత వస్తువుల్లో కోత పెట్టాలి. నిత్యావసరాలను తెలివిగా కొనాలి. మూడు ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది.. ఇది అవసరమా? రెండోది.. ఇది ఇప్పుడు అవసరమా? మూడోది.. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి?.. అనే మూడు కోణాల్లో ఆలోచించాలి.
- డాక్టర్ ఎం.సి.దాస్, ఆర్థిక రంగ నిపుణులు