గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుభొట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఇప్పటికే 34 లక్షల సొంత నిధులతో పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల కష్టం ప్రోత్సాహం వల్లే పేద కుటుంబంలో జన్మించిన తాను విద్య రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకున్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మా బడి నాడు నేడు కార్యక్రమం స్ఫూర్తిగా కె.వి పాలెం పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించామన్నారు.
పాఠశాల ప్రాంగణాన్ని స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు, క్రీడాకారుల చిత్రపటాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు తన తల్లిదండ్రులు ఉమ్మారెడ్డి వెంకయ్య, కోటమ్మ స్మారక జడ్పీ పాఠశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, ఎంపీలు హాజరవుతారని, ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాల ప్రాంగణంలో త్వరలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ఉమ్మారెడ్డి తెలియజేశారు.
ఇదీ చదవండి