తెదేపాకు మెజారిటీ ఉన్నా దుగ్గిరాల ఎంపీపీ పీఠం వైకాపాకే దక్కింది. ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు దానబోయిన సంతోష రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో రెండుసార్లు కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక మూడోసారి పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, జనసేనలకు వైస్‌ఎంపీపీ పదవులు దక్కాయి. కోఆప్షన్ పదవి కూడా తెదేపాకే లభించింది.
దుగ్గిరాలలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 9 చోట్ల తెలుగుదేశం గెలిచింది. వైకాపా 8 సీట్లు, ఒకచోట జనసేన విజయం సాధించాయి. అయితే ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్లలో బీసీ మహిళ ఒకరు మాత్రమే ఉండగా.... ఆమెకు సంబంధిత ధృవీకరణ పత్రం జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కోర్టుకు వెళ్లడంతో... కొన్ని నెలల పాటు ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైకాపా నుంచి ఎంపీపీ పదవి ఆశించిన దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతి.... తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగాలని భావించారు. ఈ విషయాన్ని గుర్తించిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.... నిన్నే ఆమెను తనవెంట తీసుకెళ్లారు. ఇవాళ ఎన్నిక సమయానికి కూడా ఆమెను తీసుకురాలేదు. ఈ పరిస్థితుల్లో వైకాపా అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయడంతో... ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు: ముస్లిం మైనారిటీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కుట్రపన్నారని తెదేపా తరుఫున దుగ్గిరాల వైస్ఎంపీపీగా ఎన్నికైన షేక్ జాబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులందరికీ బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు.. తాను ఏ విధంగా బీసీ కాకుండా పోతానాని ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు నుంచి ఎన్నిక వరకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని జనసేన తరుఫున వైస్ఎంపీపీగా ఎన్నికైన సాయి చైతన్య మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లకు అధిగమించి తాను వైస్ ఎంపీపీ దక్కించుకున్నానన్నారు.
పోలీసు ఎస్కార్టు నడుమ సభ్యులు: మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి తెదేపా సభ్యులు బస్సులో పోలీసు ఎస్కార్టు నడుమ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా తెనాలి నుంచి వైకాపా ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఎస్కార్టు ద్వారా వాహనాల్లో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం ఎంపీపీ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎంపీడీవో కార్యాలయంలోనే ఉండి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. దుగ్గిరాలలో 144 సెక్షన్ అమలుచేశారు. ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. దుగ్గిరాలలో పది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం: ఉదయాన్నే తెదేపా, వైకాపా తరఫున కోఆప్షన్ పదవికి నామినేషన్లు సమర్పించారు. అయితే సాయంత్రం జరిగే ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల తరఫున బీఫారాలు ఇవ్వాల్సి ఉంది. తెదేపా నేతలు బీఫారాలు ఇవ్వడానికి వెళితే మళ్లీ తీసుకుంటామని అధికారులు తెలిపారని, తర్వాత సమయం మించిపోయిందని తిరస్కరించారని ఆరోపించారు. దీంతో తెదేపా అభ్యర్థులు మండల ఉపాధ్యక్షుల పదవులకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబడాల్సి వచ్చింది. అయితే ఎన్నికల అధికారి రాంప్రసన్న మాట్లాడుతూ నిర్ణీత సమయంలో వారు బీఫారాలు ఇవ్వలేదన్నారు. కోఆప్షన్ సభ్యుడు, మండల ఉపాధ్యక్షుల ఎన్నికకు వైకాపా నామినేషన్ వేసినా ఎన్నిక సమయానికి మాత్రం సమావేశం నుంచి బయటికి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో తెదేపాకు చెందిన షేక్ జబీన్, జనసేనకు చెందిన పసుపులేటి సాయిచైతన్య ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కోఆప్షన్ సభ్యునిగా తెదేపా బలపరిచిన షేక్‌వహీదుల్లా గెలుపొందారు.
కోరం అవసరం లేదు: ప్రత్యేక సమావేశంలో ముగ్గురు సభ్యులు ఉంటే చాలని ఎన్నికల సంఘం చెబుతున్నందున కోరం అవసరం లేదని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. తెదేపా నేతలు ప్రలోభ పెడుతున్నారని పద్మావతి కొడుకు గతంలో కేసు పెట్టారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: "మా అమ్మను కిడ్నాప్ చేశారు.. ఇది ఎమ్మెల్యే ఆర్కే పనే"