నరసరావుపేటలో ద్విచక్ర వాహనాల దొంగలను స్థానిక రెండో పట్టణ పోలీసులు (two wheeler thieves arrested in narasaraopeta) మంగళవారం పట్టుకున్నారు. నిందితుల నుండి 22 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరావు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో పట్టణ పోలీసులు సత్తెనపల్లి రోడ్డులోని అయ్యప్పస్వామి దేవస్థానం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు పాత నేరస్థులు దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలపై అటుగా వస్తూ పోలీసులకు పట్టుపడ్డారన్నారు. వారిని పట్టుకుని విచారించగా గుంటూరు జిల్లా నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, బెల్లంకొండ, కొత్తపేట, ప్రకాశం జిల్లా సంతమాగులూరు ప్రాంతాలలో 22 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లుగా వివరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన ఉయ్యాల ప్రేమ్ కుమార్ (21), ముప్పాళ్ల దేవ సహాయం (19)లుగా గుర్తించామన్నారు. పరారీలో ఉన్న గురుబ్రహ్మం అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.
నిందితుల నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజయభాస్కరరావు వివరించారు. ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకున్న రెండో పట్టణ సీఐ వెంకట్రావు, ఎస్సై రబ్బానీ, పోలీస్ సిబ్బందిని నరసరావుపేట డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి : KOPPARRU INCIDENT: కొప్పర్రు ఘటన బాధ్యులను అరెస్టు చేశాం: ఎస్పీ విశాల్ గున్నీ