గుంటూరుజిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి గుడి వద్ద ట్రాక్టర్ల యజమానులు నిరసనకు దిగారు. ఎస్ఈబీ అధికారులు ఇసుక సరఫరాలను అడ్డుకోవటంతో ఆందోళన చేశారు. ఇసుక సరఫరా చేస్తున్న మూడు ట్రాక్టర్లను స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని యజమానులు తెలిపారు. పట్టణంలోని గృహ నిర్మాణదారులు అనుమతులతో తెప్పించుకున్న ఇసుకను వారి నిర్మాణాల వద్ద అన్‌లోడింగ్‌కు అవకాశం లేక మరో ప్రాంతంలో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. అవసరమైనప్పుడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్తుంటారని వివరించారు.
సరైన అనుమతులు ఉన్న ఇసుకను మాత్రమే తమ వాహనాల ద్వారా నిర్మాణదారులకు సరఫరా చేస్తున్నామన్నారు. లారీల ద్వారా మాత్రమే ఇసుక తరలించాలని... ట్రాక్టర్లకు అనుమతిలేకపోవటంతో అడ్డుకున్నామని అధికారులు చెప్పటం దారుణమని వాపోతున్నారు. పెద్ద వాహనాలు.. చిన్న రోడ్లున్న ప్రాంతాలకు వెళ్లటం కష్టమవుతుందని.. దీంతో నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరాకు అనుమతులు కల్పించాలని యజమానులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా అనుమతి పత్రాలున్న యజమానుల ట్రాక్టర్లను తిరిగి అప్పగిస్తామని నరసరావుపేట రెండో పట్టణ ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరులో తగ్గుతున్న వైరస్ వ్యాప్తి