distribution of plots in Amaravati : ఆర్-5 జోన్‌పై రైతుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ... ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. రాజధాని కోసం తాము భూములిస్తే.. ఇతరులకు స్థలాలు ఎలా ఇస్తారంటూ రైతులు ఉద్యమం చేస్తుంటే... పోలీసులతో ఆందోళనలను అణచివేస్తోంది. అదే దుందుడుకుతనంతో అమరావతి ప్రాంతంలో పట్టాల పంపిణీకి సిద్ధమైంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేదలకు నేడు ముఖ్యమంత్రి జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెంలో బహిరంగ సభకు లక్ష మందితో బలప్రదర్శన చేసేందుకు సమాయత్తమయ్యారు. రైతుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందనే అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు.
వాలంటీర్లతో ఆహ్వానం.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. సీఎం జగన్ చేతుల మీదుగా... గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేదలకు.. అమరావతి ప్రాంతంలో పట్టాలను అందజేయనున్నారు. వెంకటపాలెంలో జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 జిల్లాల యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లక్ష మందిని సభకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణానికి సరైన రహదారులు లేకపోవటం.. అందులోనూ వేసవి కావడంతో జన సమీకరణ కోసం అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రహదారులకు హడావుడిగా మరమ్మతులు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరినీ ఆహ్వానించారు. వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా రావాలని చెప్పారు. ప్రజల్ని తరలించేందుకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను కేటాయించారు. విద్యాసంస్థల నుంచి మరో 12వందల బస్సులు సమీకరించారు. ఉదయం 7 గంటల కల్లా బస్సులు బయలుదేరాలని ఆదేశించారు. 3వేల మంది పోలీసులను బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయించారు.
భారీ ఏర్పాట్లు.. జనం కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం... రాజధాని గ్రామాల్లోని రైతులపై మాత్రం కక్షసాధింపులకు పాల్పడుతోంది. ఎక్కువమంది రోడ్లపైకి రావొద్దని నిన్నటి నుంచే ఆంక్షలు విధించడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10గంటలకు వెంకటపాలెం చేరుకుంటారు. స్టాళ్ల సందర్శన, లబ్ధిదారులతో ఫొటో సెషన్ తర్వాత సభా వేదికపైకి వస్తారు. ప్రసంగం అనంతరం పట్టాలు పంపిణీ చేస్తారు.
ఇంకా తొలగని చిక్కులు.. పట్టాల పంపిణీకి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా.. వేచిచూడకుండా ఆదరబాదరాగా పట్టాల పంపిణీకి సిద్ధమైంది. అమరావతి బృహత్ ప్రణాళిక విచ్ఛిన్నానికే ప్రభుత్వ కుట్రలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మొత్తం 50 వేల 793 ప్లాట్లను పంపిణీకి సిద్ధం చేశారు. లేఔట్ల వద్ద ప్లాట్లకు సరిహద్దు రాళ్లు పాతడంతోపాటు నంబర్లు కూడా వేశారు. సెంటు భూమి పట్టాలతో పాటు రాజధానిలోని 5వేల టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఇవీ చదవండి :