కరోనా వైరస్ ప్రభావం... ఇటలీలో చదువుకునేందుకు వెళ్లిన రాష్ట్ర విద్యార్థులపైనా పడింది. ఇటలీలోని బొలోనియా నగరానికి 30 మందికి పైగా తెలుగు విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకు వెళ్లారు. ప్రస్తుతం కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అక్కడి వారెవరినీ ఇతర ప్రాంతాలకు వెళ్లనీయడం లేదు. ఇటలీ యంత్రాంగం ఇండియాకు విమాన సర్వీసులు సైతం రద్దు చేసింది. దీని వల్ల అక్కడి తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిలో కొందరు స్వదేశానికి వద్దామని విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్వీసులు రద్దు కావడం వల్ల ఏం చేయాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు.
గదుల్లోనే విద్యార్థులు
విద్యార్థులు ఇటలీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే... రోమ్కు వెళ్లమని అక్కడి అధికారులు సూచించారు. అక్కడ జరిపే పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఇండియా వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. అయితే బొలోనియా నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. దీని వల్ల విద్యార్థులు తమ గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రుల్లో చేర్చుకోవటం లేదు. గదుల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా భయం కారణంగా అక్కడ మాస్కులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము స్వదేశానికి చేరుకునేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: