TDP Protests Against Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. అనంతపురం జిల్లా ఉరవకొండలో పార్టీ నాయకులు మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంతకల్లులో బండపై జగన్ ఫ్లెక్సీ వేసి బట్టలు ఉతికి రజక సంఘం నేతలు దీక్ష కొనసాగించారు. అనంతపురంలో హెచ్ఎల్సీ కాల్వలో టీడీపీ కార్యకర్తలు జలదీక్ష చేశారు.
చంద్రబాబు క్షేమంగా ఉండాలని హిందూపురంలో.. వాల్మీకి సేవ సంఘం ఆధ్వర్యంలో శివుడికి రుద్రాభిషేకం చేశారు. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన సామూహిక రిలే నిరాహారదీక్ష శిబిరానికి మద్దతుగా వాల్మీకి సేవా సంఘం దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో లీగల్ సెల్ నాయకులు, లాయర్లు దీక్షలో పాల్గొన్నారు. ఆలూరులో వామపక్షాలతో కలిసి టీడీపీ నేతలు అంబేడ్కర్ సర్కిల్లో నల్ల బెలూన్లతో నిరసన ప్రదర్శన చేశారు.
చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..కృష్ణాజిల్లా కంకిపాడులో జాతీయ రహదారిపై టైర్లు కాల్చి తెలుగు యువత రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో.. కృష్ణ నది పవిత్ర సంగమం వద్ద మాజీమంత్రి కొల్లు రవీంద్ర జలదీక్ష చేశారు. చెడు వినకు.. చెడు చూడకు - చెడు మాట్లాడద్దు అంటూ.. బాపట్ల జిల్లా చీరాలలో మహిళలు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అద్దంకిలో వైసీపీ అరాచకాల్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి పాడెకట్టి నిరసన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలంటూ.. విజయనగరం జిల్లా రామభద్రాపురం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మన్యం జిల్లా మరిపెవలసలో దున్నపోతుకి వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఇందిరా కూడలిలో మోకాళ్ళపై కూర్చుని శ్రేణులు నిరసన తెలిపాయి. పలాసలో గౌతు శిరీష ఆధ్వర్యంలో జైళ్లో ఖైదీల మాదిరిగా నిలబడి ఆందోళన చేశారు. అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో టోపీలు ధరించి గాంధీ మార్గంలో శాంతియుత నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నేతల దీక్షకు రైతులు సంఘీభావం తెలిపారు.
Protests Against Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణలోనూ నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్లోని సనత్ నగర్లో టీడీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. టీడీపీ నాయకులు అతన్ని అడ్డుకుని వారించారు. అంతకుముందు నందమూరి రామకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట.. విద్యార్థి సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు.