TDP Protests Across the State Over Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ జిల‌్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 11వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలో మైనారిటీలు, జనసేన నేతలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రకాష్ నగర్‌లో అర్థనగ్నంగా బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్టీయూసీ(TNTUC) కార్మిక సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో అర్ధనగ్నంగా, కళ్లకి, నోటికి నల్ల గంతలు కట్టుకుని దీక్ష చేపట్టారు.
ముప్పవరం దీక్షలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాస్కులు ధరించి దీక్షలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరులో దీక్షలు చేస్తున్నారు. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో నాయిబ్రాహ్మణులు మేళ తాళాలు వాయించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అర్థ నగ్న ప్రదర్శన చేశారు.
విశాఖ పెందుర్తిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తెలుగు మహిళా ఆధ్వర్యంలో భారీ నిరసన రాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టును(Chandrababu arrest) ఖండిస్తూ అనకాపల్లిలో నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన నాయకులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో దీక్షలు 11వ రోజుకు చేరాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చేపట్టిన దీక్షకు 4 మండలాలలో తెలుగు మహిళా విభాగాలకు చెందిన వారు సంఘీభావం తెలిపారు. పి.గన్నవరంలో తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు. రావులపాలెం దీక్షలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన రైతులు పాల్లొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ బాబుకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. నరసన్నపేటలో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆమదాలవలసలో టీడీపీ రైతు నాయకులు నిర్వహించిన రిలే దీక్షలో కూన రవి కుమార్ పాల్గొన్నారు. జగన్ రైతులకు అన్యాయం చేస్తున్నారని వరి దుబ్బులు పట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఏలూరులో టీడీపీ రిలే దీక్షల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు కదం తొక్కారు. బాబుతో మేము సైతం అంటూ భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా అభ్యున్నతికి కృషి చేసిన దార్శనిక నేతను జైల్లో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని మహిళలు ధ్వజమెత్తారు.
కడపలో దీక్షలు కొనసాగున్నాయి. బాబుతో నేను అనే కరపత్రాలను కడప టీడీపీ ఇన్ ఛార్జ్ మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేశారు. మైదుకూరులో రిలేదీక్షలో సైకో పోవాలి- సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రిలే నిరాహార దీక్షలు పదో రోజు కొనసాగాయి. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తిరుపతిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా బాలాయపల్లిలో టీడీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. చిత్తూరు జిల్లా చంద్రబాబు త్వరగా విడుదల కావాలని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం శ్రీధ్యానాభిరామస్వామి ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిళం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. చంద్రబాబు క్షేమం కోసం దేవున్ని ప్రార్థిస్తూ ఆలయంలో పొర్లు దండాలు పెట్టారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. చంద్రబాబుకు బాసటగా కళ్యాణదుర్గంలో ఐదుగురు తెలుగు యువత నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ దీక్ష శిబిరం వద్ద అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నుదుట గోవింద నామాలు, చెవిలో పువ్వులు పెట్టుకుని తెలుగుతమ్ముళ్లు నిరసన తెలిపారు. ఎమ్మిగనూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు తేల్చి చెప్పారు.