TDP Leaders Allegations on Jagan About Chandrababu Cases: చంద్రబాబుపై అక్రమంగా ఇసుక కేసు పెట్టడంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి(Somi Reddy Allegations on Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక కుంభకోణాలను ఈడీ, సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడిన తర్వాతనే.. బాబుపై ఆ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సీఐడీని మాత్రం దించేస్తున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. వైసీపీ ప్రభుత్వంలోనే భారీగా ఇసుక కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్ వల్లే చనిపోయిందని ధ్వజమెత్తారు. జగన్ తెచ్చిన మద్యం తాగి వేలాది మంది ప్రజలు చనిపోతున్నారని వ్యాఖ్యనించారు.
చంద్రబాబును 50రోజులు నిర్బంధించి 50పైసల అవినీతినైనా కనిపెట్టగలిగారా : పయ్యావుల
Varla Ramaiah Allegations on Jagan: సీఐడీ తమ దర్యాప్తుల్లో పారదర్శకత పాటించకుండా జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం పరిధి దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తే.. రాజకీయ ఉపన్యాసం చేశారని సంజయ్ కోర్టులో చెప్పటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి చంద్రబాబుకు 14 గంటలు పట్టిందంటే అది రూట్ క్లియర్ చేయలేని పోలీసులు, ప్రభుత్వ అసమర్థత అని ఆక్షేపించారు.
Devineni Uma Allegations on Jagan: ఇరిగేషన్ మీద అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. 470 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుందని, వేసిన పంట కాపాడుకోలేక ఎండిపోతే రైతుల కంటి నుంచి నీళ్లు కాదు.. రక్తం కారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర ఆశయంతో పెట్టిన పట్టిసీమ గురించి చేతగాని ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒక్క మాట చెప్పలేకపోయాడంటూ దుయ్యబట్టారు. 55 వేల 548 కోట్లు చంద్రబాబు మంజూరు చేయిస్తే.. జగన్ 32 మంది ఎంపీలను పెట్టుకుని ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోయాడని మండిపడ్డారు.
'ప్రజల నుంచి దూరం చేసేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే సీఎం'
Pattabhi Allegations on Jagan: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీని చంద్రబాబు ప్రజలకు వివరిస్తున్నారన్న అక్కసుతో చంద్రబాబుపై ఇసుకకు సంబంధించి తప్పుడు కేసు పెట్టించారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా జగన్ తప్పుపట్టాడని ధ్వజమెత్తారు. చివరకు ప్రజలకు ఉచితంగా ఇసుక అందివ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే.. ఈ సైకో రెడ్డి నాలుగున్నరేళ్ల తర్వాత ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ..ఇప్పుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించాడని దుయ్యబట్టారు.
చంద్రబాబు రాకతో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల సంబురాలు ఆలయాల్లో పూజలు, కేక్ కటింగ్స్
Vangalapudi Anita Allegations on Jagan: రాజకీయ కక్షతోనే సీఎం జగన్ చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారని టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలలో ఎక్కువగా అవినీతి ఎవరు చేశారని అడిగితే.. చిన్నపిల్లల సైతం జగన్ పేరు చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్న జగన్.. నాలుగేళ్లు అయినా మద్యం నిషేధం చేయలేదన్నారు. మద్యంలో అధికారికంగా జగన్ కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు.