TDP&JSP Leaders Protest Against cahndrababu Arest : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపిన అధికారుల భరతం పడతామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తరువాత చంద్రబాబును ఏ జైలుకు పంపించారో, జగన్‌ను అక్కడికే పంపడం ఖాయమని చెప్పారు. స్థానిక ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన 'బాబుతో నేను' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌పై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయప పని లేదని, అందుకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు.
ఎవరైతే మిమల్ని స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టించారో, దానిలోనే వారికి తగిన మర్యాద చేయిస్తానని కార్య కర్తలకు భరోసా కల్పించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ ప్రకటించడంపై యరపతినేని స్వాగతించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి జగన్‌ను ఇంటికి పంపిస్తామని తెలిపారు.
Leaders Accept Telugu Desam Party Janasena Party Alliance : తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయడంతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని పార్టీ నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిన్న టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న నాయకులు తమ మద్దతును తెలిపారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన కూటమి వైసీపీ ప్రభుత్వాన్ని పెకలిస్తుందని హెచ్చరించారు.
చంద్రబాబు ప్లెక్సీలను తొలగించిన పోలీసులు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శివాలయం కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ దీక్షా శిబిరాన్ని పోలీసులు రాత్రి తొలగించారు. గత రెండు రోజుల నుంచి వరదరాజుల రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడే నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో శివాలయం కూడలిలో కట్టిన టెంట్లు, చంద్రబాబు ప్లెక్సీలను పోలీసులు తొలగించారు. దీంతో దీక్ష శిబిరం వద్దకు వెళ్లకుండా వరదరాజుల రెడ్డిని అడ్డుకుందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెళ్లటూరులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, రిమాండుకు నిరసనగా టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని.. లేదంటే నిరసనలు ఉదృతం చేస్తామని తెలిపారు. వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని, మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారని, ఏపీ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, త్వరలోనే జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిచారు.
జైల్లో చంద్రబాబుకు భద్రత లేదు : చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దార్శికనేత చంద్రబాబుకు అభివృద్ధి తప్ప అవినీతి గురించి తెలియదని చెప్పారు. రాజమహేంద్ర వరం జైల్లో చంద్రబాబుకు భద్రత (No security for Chandrababu in Jail) లేదని.. ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు.
మూడవ రోజుకు రిలే దీక్షలు : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. దువ్వూరు మండల నాయకుడు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుస్తుంది. దీక్షలో తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.