MLA QUOTA MLC ELECTIONS : రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ఈ నెల 13న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా గెలవాలని వైసీపీ కుయక్తులకు పాల్పుడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాటిని చిత్తుచేయాలని విపక్ష నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. శాసనసభలో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి జరిగే ఈ ఎన్నిక ప్రక్రియలో తెలుగుదేశం అభ్యర్థిని దింపే ఆలోచన చేయడంతో రాజీకీయం రసవత్తరంగా మారింది. అధినేత చంద్రబాబు.. పార్టీ సీనియర్ నేతలతో వ్యూహ కమిటీ సమావేశంలో కీలకంగా దీనిపై చర్చించినట్లు సమాచారం. అయితే ఆ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగనుండగా.. మార్చి 13న నామినేషన్ల దాఖలుకు గడువుంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం ఉంటుంది.
ఆ మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరైనా చేరుకోకుంటే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకమవుతాయి. శాసనసభ పక్షంలో సాంకేతికంగా తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్‌లు వైసీపీలో చేరినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. ఎన్నికల్లో పోటీకి దిగితే తెలుగుదేశం అందరికీ విప్ జారీ చేయనున్నట్లు సమాచారం. అయితే ఆయా ఎమ్మెల్యేలు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటు వేయకుండా విప్‌ను ఉల్లంఘిస్తే.. ఆయా ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
అటు అధికార పార్టీ వైసీపీనూ పలువురు అసమ్మతి ఎమ్మెల్యేల సెగ వేధిస్తుంది. దీంతో తెలుగుదేశం బరిలోకి దిగితే ఎన్నిక రసవత్తరం కానుంది. తమ ఓట్లు తమకు పడేలా చూసుకోవడంతో పాటు ఆత్మాప్రబోధానానుసారం అనే అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పైనా వ్యూహ కమిటీలో పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పీడీఎఫ్, జనసేన పార్టీలతో సమన్వయం చేసుకునే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 13 జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్నిచోట్ల వైసీపీ ఏకగ్రీవమైన.. మరికొన్ని చోట్ల టీడీపీ గెలవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: