TDP Leader Tenali Sravan Kumar on DGP: జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే, డీజీపీ ఆయనకు సన్నాయినొక్కులు నొక్కడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఐపీఎస్‌లు చట్టాల్ని వైసీపీ నేతల కాళ్ల కింద తొక్కేస్తూ, ప్రజల్ని వేధించడమేనా శాంతి భద్రతలు బాగుండటమంటే అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు అదుపులో ఉండటమంటే.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వారిపై తప్పుడు కేసులు పెట్టి, కబ్జాదారులు, నేరగాళ్లకు వత్తాసు పలకడమేనా అని నిలదీశారు.
ఉదయం కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు, రాత్రుళ్లు రేప్‌లు, భూకబ్జాలు జరుగుతుంటే డీజీపీకి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. పెనమలూరులో ట్రస్ట్ భూమిని దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతల్ని వదిలేసి, భూముల్ని కాపాడమని ఫిర్యాదు చేసిన ఎన్.ఆర్.ఐలను బెదిరించడాన్ని తప్పుబట్టారు. హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం పోలీస్ వ్యవస్థకు తలవంపులని మండిపడ్డారు. పెనమలూరులోని ట్రస్ట్ భూమి కబ్జా వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు, కర్నూలు జిల్లా వైసీపీ నేత హస్తముందని డీజీపీకి తెలియదా అని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి అయిన సీఐడీ చీఫ్ సంజయ్ ఏ విషయాన్ని దేనికి ముడిపెట్టాలో తెలియకుండా.. ఆ స్థానంలో ఉండటం ఐపీఎస్ వ్యవస్థకే సిగ్గుచేటని మండిపడ్డారు.
పద్నాలుగు సంవత్సరాల బాలుడి హత్యలో వైసీపీకి చెందిన వ్యక్తి ప్రమేయం ఉంటే రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ ఏవిధంగా అమలైందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే.. ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు ఫ్రాన్సిక (35) మృతి చెందిందని శ్రావణ్ విమర్శించారు. ఇలా, రోజుకోచోట దాడులు, హత్యలు, కిడ్నాప్, మానభంగాలు జరుగుతున్నా... డీజీపీ మాత్రం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని చెబుతున్నాడని విమర్శించారు. అధికార పార్టీ చేసే తప్పులు పోలీసులకు కనిపించడం లేదన్న తెనాలి శ్రావణ్.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తే, ముందస్తు అరెస్ట్‌లు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.
'పెనమలూరులో ట్రస్ట్ భూమిని దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలపై కేసు పెడితే.. వైసీపీ నేతల్ని వదిలేసి, భూముల్ని కాపాడమని ఫిర్యాదు చేసిన ఎన్.ఆర్.ఐలను బెదిరించారు. పెనమలూరులోని ట్రస్ట్ భూమి కబ్జా వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు, కర్నూలు జిల్లా వైసీపీ నేత హస్తముందని డీజీపీకి తెలియదా? న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లే వారిపై తప్పుడు కేసులు పెట్టి, కబ్జాదారులు, నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నారు.'- తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే