ప్రేమ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన సౌమ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడికొండ, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వాసిరెడ్డి పద్మ హామీ అన్నారు. కుటుంబం పరువు పోతుందని సౌమ్య ప్రేమ వేధింపులు బయటకు చెప్పుకోలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని బతికించేందుకు డాక్టర్లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వరప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. గ్రామంలో ఆకతాయిలపై ఫిర్యాదులు అందాయని.. ఇకపై అలాంటివి జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి దిశా చట్టం తీసుకువచ్చారని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. సౌమ్య కేసులో ఆమె కుటుంబానికి అండగా ఉండటంతో పాటు... నిందితులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చారు. బాలిక సౌమ్య తీసిన వీడియో ఆధారంగా యువకుడు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. ఇప్పటికే అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అలాగే కొర్రపాడు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ కళ్లెదుటే చనిపోయిందని.. ఆ బాధ భరించలేక పోతున్నామని బాలిక తల్లిదండ్రులు మాధవరావు, పుష్పవతి కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
ఇదీ చదవండీ...ఒడి వదిలి వెళ్లిన బిడ్డకు గుడి.. ట్రస్ట్‌తో సాయం