State Govt orders sanctioning DA. DR: ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీఓ నెంబరు 66, పెన్షనర్లకు 2.73 శాతం డీఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంజూరు చేసిన కొత్త డీఏను 2023 జూన్ 1వ తేదీ నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది. 2022 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబరు, డిసెంబర్, మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల డీఏ 22.75 శాతానికి చేరినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డి తెలిపారు.
మే 9 నుంచి జూన్ 9వ తేదీ వరకు మూడో దశ ఉద్యమం.. పీఆర్సీ పెండింగ్ అంశాలపై ఆందోళన కొనసాగిస్తున్న ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు.. మూడోదశ ఉద్యమ కార్యచరణ నోటీసును సీఎస్‌కు అందజేయనున్నారు. మూడో దశలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాల జాబితాను సీఎస్ జవహర్‌రెడ్డికి ఇవ్వనున్నారు. మే 9 నుంచి జూన్ 9వ తేదీ వరకు మూడో దశ ఉద్యమ కార్యచరణ చేపట్టనున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ప్రకటింటింది.
ఉప్పెన పేరుతో వర్షంలోనూ మహాధర్నా.. సీపీఎస్ రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఉప్పెన పేరుతో వర్షంలోనూ ఉపాధ్యాయ సంఘాలు మహాధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు ధర్నాకు టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సీపీఎస్ రద్దు చేయాలని.. లేకుంటే హిట్లర్ మాదిరిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరగనున్న ఉపాధ్యాయ సమావేశానికి విజయనగరం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరిన వారిని భోగాపురం జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టాలని ఉపాధ్యాయులు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు.
స్టేషన్లోనే ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు.. సీపీఎస్ రద్దు కోసం.. విశాఖ బయులుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన 40 మంది టీచర్లు.. ఉపాధ్యాయుల ఉప్పెన పేరుతో నిరసన చేసేందుకు.. విశాఖకు బయలుదేరగా.. భోగాపురం వద్ద పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కి తరలించారు. దీంతో స్టేషన్లోనే ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటం తగదని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: