గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కీర్తి మార్కెట్‌లో వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ఉపాధ్యాయులతో పంచుకుంది. ఆమె ఆలోచనను ఉపాధ్యాయులు ఇన్‌స్పైర్ అవార్డ్సు మానక్ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఇది నచ్చి.. రూ.10వేలు మంజూరు చేస్తూ ప్రాజెక్టుగా చేయమని ఇన్‌స్పైర్ అవార్డ్సు నుంచి సమాధానం వచ్చింది. దీంతో భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు రాయపాటి శివనాగేశ్వరరావు సహకారంతో సౌర పలకల సాయంతో తోపుడు బండిపై ఒక కూలింగ్ ఛాంబర్ ఏర్పాటు చేసి అందులో కూరగాయలు విక్రయించేలా ‘వెండర్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్’ను తయారు చేసింది. దానిపైనే సోలార్ బల్బు, పంకా, మైకు ఏర్పాటు చేసింది. కూలింగ్ ఛాంబర్‌లో కూరగాయలు 5 నుంచి 6 రోజుల పాటు తాజాగా ఉంటాయి. దీని తయారీకి రూ.8 వేల వరకు వెచ్చించారు. కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్సు మానక్‌లో ఈ ప్రాజెక్టు ఎంపికైంది. దేశవ్యాప్తంగా 581 ప్రాజెక్టులు ఎంపిక చేయగా.. అందులో ఇది కూడా ఉంది. పేదలకు మేలు చేసే 60 ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో ఇన్‌స్పైర్ ప్రతినిధులు కీర్తిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు. విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు వెండర్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను పరిశీలించి కీర్తిని అభినందించారు.
ఇదీ చదవండి: NV Ramana: 'ఒదిగిన కాలం' పుస్తకావిష్కరణ.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడిపై సీజేఐ ప్రశంసలు