త్రికోటేశ్వరస్వామి దేవస్థానం చరిత్రలో 1990వ దశకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కోటప్పకొండకు ఘాట్మార్గ నిర్మాణం, ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే త్రికూటాచలంపై ప్రత్యేకత చాటేలా ప్రసాదం ఉండాలన్న ఆలోచన చేశారు. అప్పటి మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, వేదపండితులు చర్చించి అరిసెను నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీని తీసుకొచ్చారు. భగవంతుని నైవేద్యంగా సమర్పించే వాటిని భోగాలని పిలుస్తారు. స్వామికి సమర్పించే భోగాల్లో పులిహోర, చక్రపొంగాలి వంటివి ఉన్నాయి.
ఈ క్రమంలోనే అపురూపం(అరిసె)ను స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా గుర్తించి ఇక్కడ అమలు చేయడం ప్రారంభించారు. స్వామికి అరిసె ప్రసాదం నివేదన చేసిన తర్వాత కౌంటర్లకు తరలించి భక్తులకు విక్రయిస్తారు. వీటిని కోటప్పకొండపైన వంటశాలలో తయారు చేస్తారు. ఈ అరిసె తయారీకి ప్రత్యేక దిట్టం అమలు చేస్తారు. 360 అరిసెల తయారీకి ఉపయోగించాల్సిన వస్తువులను దిట్టం అపిగా పిలుస్తారు. ఒక పట్టీలో 5కిలోల నెయ్యి, 12కిలోల బియ్యం, 8కిలోల బెల్లం, 100గ్రాముల యాలకులు, 5గ్రాముల పచ్చకర్పూరం వినియోగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి, పచ్చకర్పూరం వాడకంతో అరిసెకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. నెలకు 20వేల అరిసెలు స్వామి వారి వంటశాల్లో తయారౌతాయి. అదే కార్తికమాసం, మహాశివరాత్రి సమయాల్లో లక్షకుపైగా భక్తుల కోసం సిద్ధం చేస్తారు.
ఇదీ చదవండీ...సబ్బుపై శివయ్యని చిత్రీకరించిన సూక్ష్మ కళాకారుడు