GUNTUR PEOPLE FACING PROBLEMS WITH SHRIKING LANDS: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో భూమి 50 అడుగుల నుంచి 60 అడుగుల లోతు దాకా కుంగింది. రెండేళ్ల నుంచి ప్రతి ఏటా గ్రామ సమీపంలో భూమి కుంగుతుండటంతో అన్నదాతలు వ్యవసాయపనులకు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెద్ద రాతి పొరలు సైతం లోయలను తలపిస్తున్నాయి. 2019లో బోదిలవీడు-గుండ్లపాడు గ్రామాల మధ్య కిలోమీటర్ మేరకు పొలాల్లో భూమి కుంగింది. వ్యవసాయ బోర్లు అప్పట్లో 80 దాకా మొరాయించాయి. 2020లో బోదిలవీడు గ్రామ విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో గతేడాది భూమి కుంగింది. దానిచుట్టూ నెర్రెలొచ్చాయి. 60 అడుగులకు పైగా లోతట్టు ప్రాంతం లోయను తలపిస్తోంది.
బోదిలవీడులో 2300 మంది దాకా జనాభా నివసిస్తుండగా, వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వెల్దుర్తి మండలంలో వ్యవసాయ బోర్లు 1000 అడుగుల నుంచి 1200 అడుగుల దాకా వేస్తున్నారు. గ్రామంలో ఇలా భూమి కుంగితే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భూమి కొంతమేర దిగువకు కుంగినట్లు కనిపించినా అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. వ్యవసాయం మానేస్తున్నారు. భూగర్భ పరిశోధన విభాగం, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా ప్రమాదకర పరిస్థితులు ఉన్నచోట పరిశీలించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగితేనే బోదిలవీడు భయం నీడ నుంచి బయటపడే అవకాశముంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
గ్రామం చుట్టూ పొంచి ఉన్న ప్రమాదంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పొలాల్లో కుంగుతున్న భూములతో అన్నదాతలు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామం సందర్శించి సమస్యను పరిష్కరించాలి. ఇటీవల ఉపాధిహామీ పథకం కింద భూమి భారీగా కుంగిన చోట రక్షణ ఏర్పాట్లు చేయించాం. - కృష్ణకుమారి, సర్పంచి, బోదిలవీడు.
విచ్చలవిడిగా బోర్లు వేయడంతోనే సమస్య..
నిబంధనలు అతిక్రమించి విచ్చలవిడిగా పక్కపక్కనే బోర్లు వేయడంతో బోదిలవీడు గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. భూమిలో రాతిపొరల మధ్య నీరు ఖాళీ అయి కుంగిపోతోంది. బోర్లు వేసే విషయంలో నిబంధనలు పాటిస్తే సమస్యను నియంత్రించవచ్చు. - శంకర్, జియాలజిస్ట్, మాచర్ల
ఇదీ చూడండి: AP Governor Bishwabhushan Fell Sick: గవర్నర్ బిశ్వభూషణ్‌కు మరోసారి అస్వస్థత