Amaravati Secretariat: గణతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని సచివాలయాన్ని సర్వాగం సుందరంగా ముస్తాబు చేశారు. సచివాలయ ప్రాంగణంలోని ఐదు భవనాలతో పాటు అసెంబ్లీ భవనాలనూ విద్యుత్ దీపాలతో అలంరించారు. వివిధ రంగుల విద్యుత్ దీపాలతో సచివాలయ, అసెంబ్లీ భవనాల ప్రాంగణాలు వెలుగులీనాయి. ఉదయం 9 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అంతకుముందు రేపు ఉదయం 7.30 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎస్ జవహర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి భవనంపై శాన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు, 8.15 గంటలకు స్పీకర్ తమ్మినేని సీతారం జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర హైకోర్టు వద్ద సీజే జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. రేపు ఉదయం 9 గంటలకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పంచాయితీ కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సచివాలయాల్లో విధిగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని సర్క్యులర్ జారీ అయ్యింది. సచివాలయ పరిధిలో ఎన్నికైన ప్రజాప్రతినిధిని ఆహ్వానించి పతాకావిష్కరణ చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ లబ్దిపొందిన వారి వివరాలను తెలియచేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే గణతంత్ర వేడుకల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయాలని సూచన చేశారు.
ఇవీ చదవండి: