గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీర ప్రాంతంలో ఉప్పు సాగు జీవనాధారంగా ఎంతోమంది రైతు కుటుంబాలు జీవిస్తున్నారు. ఒక ఎకరం స్థలంలో సెంటు చొప్పున గట్లు కట్టి 100 మడులను తయారుచేసి సాగు చేపడతారు. ఒక్కో మడిలో బంకమట్టిని పోసి ... దానిలో ఉప్పు నీటిని పెట్టి కాళ్లతో తొక్కి ...పూర్తిగా గట్టిపడ్డాక దింసెతో కొట్టి ఇలా నెల రోజులు శ్రమించిన తరువాత దరువుల్లో నుంచి ఇంజన్లతో ఉప్పు నీటిని కాగుమడి ద్వారా మడుల్లోకి వదులుతారు. అలా వదిలిన 15 రోజుల తర్వాత నీరు ఆవిరై... ఉప్పు తయారవుతుంది. ఇలా ఒక్కో మడికి బస్తా వరకు పంట దిగుబడి ఉంటుంది. పండించిన ఉప్పును తాటాకుతో ఏర్పాటుచేసిన గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. ఎంతో కష్టపడి జీవనం సాగిస్తూ ఉండే రైతులకు మామూలు రోజుల్లోనే గిట్టుబాటు ధర ఉండదు. అలాంటిది ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ ఉండటంతో చాల మంది రైతులు సగంలోనే పంట సాగు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతి ఏటా 5 నెలలపాటు రేపల్లె నియోజకవర్గంలోని లంకెవానిదిబ్బ, దిండి, మొల్లగుంట, కొత్తపాలెం, నిజాంపట్నం ప్రాంతాల్లో వేల ఎకరాల్లో సాగు చేస్తారు. కానీ ప్రభుత్వ నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో... మరోవైపు గిట్టుబాటు ధర రాకపోవడంతో రోజురోజుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. ఉప్పు సాగుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం సరైన జీవనోపాధి లేక అల్లాడిపోతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఉప్పు రైతుల జీవనం... ఈ కరోన వలన పూర్తిగా దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలతో పంట పోయిందని...మరల వేస్తే లాక్డౌన్ వచ్చి అమ్మకాలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏదోవిధంగా ఉప్పు సాగుపై ఆధారపడిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉప్పుకు గిట్టుబాటు ధర కల్పించాలని...ప్రభుత్వం సహకారం అందిచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి. దయనీయం.. వీరి జీవితం