Purandeshwari Demands Compensation to Farmers for Damaged Crops: తుపానులు, ఈదురుగాలులు, వడగళ్లు, అతివృష్టి లేదంటే అనావృష్టి అని రాష్ట్రంలో రైతులపై ఏదోఒక ప్రభావం పడుతూనే ఉంది. వీటికి తోడు జగన్ సర్కారు వికృత రాజకీయం తోడవటంతో రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల్లో తేలుతున్నారు. పేదలపక్షపాతినని చెప్పుకునే సీఎం జగన్‌కు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు. తాజాగా మింగ్జాం తుపాన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తీరని వేదన మిగిల్చింది. వరి పంటను కోసి కల్లాల్లోకి తెచ్చుకున్న రైతులు కురుస్తున్న వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు తడిసి, నానిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, ప్రతిపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.
కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'
మిగ్‌జాం తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆహారాధాన్యాలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పంటకు బీమా చేసిన రైతులు ఎంతమంది లేనివారు ఎంతమంది అనే గణాంకాలను ప్రభుత్వం వెంటనే బహిరంగపరచాలని కోరారు. వరి పంట చేతికి అందుతున్న దశలో తుపాను వారి ఆశలను చిదిమేసిందన్నారు. ఎకరానికి సుమారుగా 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత పంట ఇంటికి రాదు అని తెలిసి రైతు పడే బాధను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధం చేసుకుని పూర్తి స్ధాయి పెట్టుబడి సాయం అందించాలని కోరారు.
వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్‌జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత
వాటితో పాటు రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కూడా పంట పొలాల వద్దే ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 48 గంటల్లోగా పంట నష్టం అంచనాలు యుద్దప్రాతిపదికన పూర్తి చేయించి తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. తుపాను వల్ల సన్న, చిన్నకారు రైతులకు పూట గడవని పరిస్ధితి ఎదుర్కొంటున్నారని కౌలు రైతులు పరిస్ధితి మరీదారుణంగా ఉందని ఆవేదన చెందారు. వరి పంట పూర్తిగా తడిసి ముద్దైందని తాత్సారం చేయకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
రైతులకు కన్నీటిని మిగిల్చిన తుపాను - పంట మెులకలు వచ్చే అవకాశం
ఉద్యాన వన పంటలకు సంబందించి వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి టమోటా, అరటి వంటి పంటలు కూడా తీసుకొచ్చినందున రైతుల నష్టం వివరాలు ప్రభుత్వం తేల్చాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో అరటి రైతులు బాగా నష్ట పోయారని అన్నారు. ఎకరా అరటి పంటకు సుమారుగా లక్ష పెట్టుబడి పెట్టిన పరిస్ధితిలో వారికి వాటిల్లిన నష్టం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎసైన్డ్ భూముల్లో పంట ఆన్లైన్ చేయని కారణంగా వారికి నష్ట పరిహారం ఏవిధంగా అందించాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ శ్రేణులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సహకారం అందించాలని కోరారు.