- గుంటూరులో..
పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సప్తాహంలో భాగంగా గుంటూరు లాడ్జిసెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సేవా సప్తాహంలో భాగంగా మొదటిరోజు దివ్యాంగుల ఆశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రెండో రోజులో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రధాని మోడీ హంగు, ఆర్భాటాల కన్నా దేశాభ్యున్నతి కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మొక్కలు నాటినట్లు చెప్పారు.
- తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ నెల 14 నుంచి 20 తేదీ వరకు సేవా సప్తాహ కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తుమ్మల పద్మజాప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు, మాస్కులు పంచారు.
- అనంతపురం జిల్లాలో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సేవా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సప్తాహ సేవా కార్యక్రమాల్లో భాగంగా భాజపా నాయకులు మొక్కలు నాటారు అనంతపురం జిల్లా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ పురం లో భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ భాజపా నాయకులు, కార్యకర్తలు 70 మొక్కలు నాటారు ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలోని ప్రతి మండలంలోనూ 70 మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యతను భాజపా శ్రేణులు తీసుకుంటాయని వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు.
- నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాయుడు ఆధ్వర్యంలో... ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో నిర్మించిన భవనాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రంగులు మార్చి మభ్యపెడుతూ ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ వేదికగా గుఱ్ఱం జాషువా 125వ జయంతి