ఒక నేరస్థుడు సీఎం కావడమే రాష్ట్ర ప్రజలకు పట్టిన శని అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పదివేల మంది జేఏసీ నాయకులకు నోటీసులు ఇచ్చిన చరిత్ర వైకాపా ప్రభుత్వానిదేనని.. దేవతల రాజధాని అమరావతి మార్చాలని ప్రయత్నం చేస్తున్న సీఎం మట్టి కొట్టుకుని పోతారని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతటి ప్రభుత్వాలు అయినా కూలిపోతాయన్నారు.
విశాఖలో ప్రభుత్వ భూములు కాజేయడానికి... ఉన్న భూముల ధర పెంచుకోవడానికి సీఎం జగన్ రాజధాని మార్పు చేపట్టారన్నారు. చంద్రబాబు కష్టాన్ని ప్రస్తుత సీఎం బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. రెండు కాన్వాయ్‌లలో కేబినెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన మొదటి సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక బిల్లులను కృష్ణా, గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమోదిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రత్తిపాటి అన్నారు.
ఇవీ చదవండి...'రాజధానిపై రెఫరెండానికి ప్రభుత్వం సిద్ధమా?'