power department employees protest : గుంటూరు జిల్లా తెనాలిలో విద్యుత్ శాఖ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో.. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వం, యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు.. వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహానికి తమ 24 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. విద్యుత్ శాఖలో గల పలు విభాగాలు జేఏసీగా ఏర్పడి.. ఈనెల 23వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు. అప్పటిలోగా ప్రభుత్వం, యాజమానాలు స్పందించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే తమ నిరసనను విరమించుకుంటామని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏ ఒక్క ఉద్యోగిని సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాజమాన్యం తీసుకున్న నూతన నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఏపీసీపీడీసీఎల్ ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకం ద్వారా తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అలా కాకుండా ఉద్యోగి చనిపోతే.. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించి.. జీతభత్యాలు కూడా తగ్గించి ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత నిబంధనల ప్రకారం నూతనంగా ఉద్యోగ అవకాశం కల్పించిన వ్యక్తిని.. రెగ్యులర్ చేసి అప్పటి జీతభత్యాలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు, కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. దానిని జెన్కో ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి