Ponguleti Comments on Elections : తెలంగాణలో రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఏ పదవిలో లేకపోయినా.. ప్రజలతోనే మమేకమవుతూ వచ్చానని తెలిపారు. జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తానని పేర్కొన్నారు. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
"చేప నీటిలో ఉండటం ఎంత సర్వసాధారణమో.. అదే విధంగా రాజకీయ నాయకుడు ప్రజల దీవెనలు, అభిమానులు పొందిన నాడే రాజకీయాల్లో రాణిస్తాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తాను. రాబోయే ఎన్నికల్లో, కురుక్షేత్రంలో కచ్చితంగా యుద్ధంలో పాల్గొంటా. - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ
ప్రజలు మెచ్చేవారంతా పోటీలో ఉంటారు..: కొద్దిరోజుల క్రితమే.. గడిచిన 4 ఏళ్లలో బీఆర్ఎస్లో ఏం జరిగిందో తమకు తెలుసని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో దక్కిన గౌరవం ఏంటో తెలుసని అనుచరుతో పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలియనిది కాదని వివరించారు . వచ్చే ఎన్నికల్లో అర్హత ఉన్నవారంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలు మెచ్చేవారంతా తప్పకుండా పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే పొంగులేటి భద్రత కోసం కేటాయించిన 3+3 భద్రతను 2+2కు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రతతో పాటు పొంగులేటికి కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. ఖమ్మంలోని పొంగులేటి నివాసం వద్ద భద్రత విధులు నిర్వహించే నలుగురు సిబ్బందిని తొలగించింది.
ఇవీ చదవండి: