గుంటూరు జిల్లా పిడుగురాళ్ల స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జూనియర్ సివిల్ కోర్టులో గురువారం హాజరుపరిచినట్టు పట్టణ సీఐ ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పల్లపు ప్రసాద్, బిర్లంగి నేతాజీ సుభాష్, బెండి సతీష్, బుడ్డి ప్రసన్నకుమార్‌లు గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నూరి మహేష్‌ను పిడుగురాళ్లలో అమ్మకానికి ప్లాట్లు ఉన్నాయని తమతో వస్తే చూపిస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన మహేష్ కుమార్ డిసెంబరు 15న పిడుగురాళ్ల పట్టణంలోని ఆయేషా దాబా వద్దకు వచ్చాడు.
అక్కడ కిడ్నాప్ చేసి హైదరాబాద్ సమీపంలో మెుయినాబాద్ ప్రాంతానికి కారులో తీసుకెళ్లి ఒక గృహంలో బంధించి కొట్టారు. రూ.75 లక్షలు డిమాండ్ చేయగా.. రూ.19 లక్షల నగదును వారికి అందజేశాడు. తరువాత రెండు విడతలుగా ఒకసారి రూ.12 లక్షలు, మరోసారి రూ.13 లక్షలు నగదు తీసుకున్నాక వదిలేశారు. ఘటనపై జనవరి 23న పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో మహేష్ కుమార్ ఫిర్యాదు చేయగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి దగ్గరినుంచి రూ.15 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: