People Suffering Due to Electricity Charges Hike: 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వాడిన విద్యుత్‌కు ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తోంది. అసలు కంటే కొసరు ఛార్జీల భారం ఎక్కువైందని ప్రజలు వాపోతున్నారు. ట్రూ అప్, సర్దుబాటు, ఎఫ్‌పీపీసీఏ.. ఇలా రకాల పేర్లతో ప్రజలపై ఆర్థిక భారాన్ని ప్రభుత్వం వేస్తోంది. ఎప్పుడో వినియోగించిన విద్యుత్‌కు ఆనాడే బిల్లు కట్టేసినా.. విద్యుత్ సంస్థలు మాత్రం అదనంగా వసూలు చేస్తున్నాయి.
ప్రపంచంలో అమ్మేసిన ఏ వస్తువులకూ తిరిగి అదనంగా డబ్బులు వసూలు చేసే పద్ధతి ఉండదు. కానీ విద్యుత్‌లో మాత్రం సంస్కరణల పేరుతో ఈ సర్దుబాటు ఛార్జీలకు పాలకులు చట్టబద్ధత కల్పించారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం 2900 కోట్ల లోటు వచ్చిందని.. దాన్ని జనం నుంచి 36 నెలల పాటు వసూలు చేసేందుకు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా అనుమతి పొందింది.
Electricity Charges Hike: మరోసారి బాదుడే బాదుడు.. విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పిడుగు
ఇప్పటికే 13 నెలలు వసూలు చేశారు. ఇంకా 25 నెలలు యూనిట్‌కు సుమారు 20 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. దీంతో పాటు 2021– 2022లో వినియోగించిన కరెంటుకు కట్టిన బిల్లులు సరిపోలేదని.. అదనంగా 3వేల 83 కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం దీన్ని అమలు చేస్తున్నారు. ఏ నెలలో అయినా అదనపు ఖర్చును.. మరుసటి నెలలోనే వసూలు చెయ్యాలన్న కేంద్రం విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి.. యూనిట్‌కు 80 పైసలు చొప్పున ప్రజలపై అదనపు భారం మోపింది.
గతంలో కస్టమర్ ఛార్జీలు, యూజర్ ఛార్జీలు ఉన్నా.. వాటికి అదనంగా సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలు జోడించి ప్రభుత్వం పేదలను ఆర్థికంగా దోచుకుంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ఉపాధి లేక, నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందిపడుతుంటే.. కరెంటు ఛార్జీల భారం వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వివిధ పేర్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ప్రజలు చెబుతున్నారు.
Electricity Charges :విద్యుత్ వినియోగదారులకు షాక్.. మరోసారి సర్దుబాటు ఛార్జీల భారం
ప్రభుత్వ విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి చేస్తే.. తక్కువ ఖర్చు అవుతుంది. కానీ విద్యుత్ కోతలు ఉండరాదని ప్రైవేటు కంపెనీల వద్ద అధిక ధర చెల్లించి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తోంది. అయినా రాష్ట్రంలో కరెంటు కోతలు మాత్రం తప్పడం లేదు. విద్యుత్ బిల్లులు భారీగా వేస్తున్న ప్రభుత్వం.. కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని జనం గగ్గోలుపెడుతున్నారు.
"ఈ నాలుగున్నర సంవత్సరాలలో తొమ్మిది సార్లు కరెంటు రేట్లు పెరిగాయి. 120 నుంచి 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు.. నేడు 1500 వరకూ వస్తుంది. అదే విధంగా ఏసీ కానీ, ఇతర వస్తువులు వాడిన వారికి అయితే 3000 రూపాయల బిల్లు వస్తుంది. ఈ బిల్లులు మధ్యతరగతి వాళ్లకు తీవ్ర భారంగా అనిపిస్తుంది". - చంద్రశేఖర్, చిరు వ్యాపారి
"మా ఇంట్లో ఏసీ ఉంది. ఎప్పుడూ కూడా 600 నుంచి 800 మధ్యలో కరెంటు బిల్లు వచ్చేది. కానీ నేడు 2600 రూపాయలు వచ్చింది. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారు". - రాజు, విజయవాడ వాసి