Guntur YCP MLA Mustafa: లక్ష రూపాయల పని.. నియోజకవర్గంలో చేయించలేక పోతున్నానంటూ గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా చెప్పడం విస్మయం కలిగించింది. ముస్తఫా తొమ్మిదేళ్లుగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల గురించి ఎప్పుడూ అసెంబ్లీలో మాట్లాడింది లేదు. నగరపాలక సంస్థ సమావేశాల్లో మాత్రం ఆధిపత్యం చూపడానికి ప్రయత్నిస్తుంటారు. కార్పొరేటర్లు ఎవరు ఏ అంశం లేవనెత్తినా.. ఆయన మైక్ తీసుకుంటారు.
ఈ నెల 23, 24న రెండ్రోజులపాటు జరిగిన సమావేశాల్లోనూ ముస్తఫా పదేపదే మాట్లాడారు. నియోజకవర్గంలో డ్రెయిన్లు, అభివృద్ధి పనులపై గంటన్నరకు పైగా మాట్లాడి.. సహచర సభ్యులకు విసుగు తెప్పించారు. అలాగని.. నగరంలో అభివృద్ధికి ఆయన చేసిందేమైనా ఉందా అంటే అదీ లేదు. గాంధీ పార్కుని కార్పొరేషన్ నిధులతో ఆధునీకీకరిస్తే.. అక్కడ తనవారికి స్టాళ్లు, పార్కింగ్ కాంట్రాక్టు ఇవ్వాలనే ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్కు నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఖర్చుల వివరాలు చెప్పాలని మేయర్ సహా అధికారుల్ని ఎమ్మెల్యేనే నిలదీశారు.
దీనిపై స్పందించిన మేయర్.. ఎమ్మెల్యేను పార్కు వద్దకు తీసుకెళ్లి.. అక్కడ జరిగిన ప్రతి పనికీ లెక్కచెప్పాలని సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ చిన్న అభివృద్ధి పనైనా.. ఆ కాంట్రాక్టు ఎమ్మెల్యే కుటుంబసభ్యులకే దక్కాలని, ఇతరులకు దక్కితే అడ్డుపుల్ల వేయడం, అవినీతి ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని.. విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తె నూరి ఫాతిమాను రాజకీయాల్లోకి తెచ్చే క్రమంలో.. అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా చోట్ల సరైన రహదారులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీటి సమస్య వేధిస్తోంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అపవాదును ఎమ్మెల్యే మూటగట్టుకున్నారు. భూగర్భ డ్రైనేజీకి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చలేదని.. ఇటీవల పాత గుంటూరులో ముస్తఫాను స్థానికులు అడ్డుకున్నారు. వారిపై ఆయన శాపనార్థాలకు దిగడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారుల గురించి కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడి.. వారిని తనదారిలోకి తెచ్చుకుంటారనే వాదనా ఉంది.
ఇప్పుడు.. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడటం వెనుక.. మేయర్‌తో విభేదాలే కారణమనే ఆరోపణలున్నాయి. ముస్తఫా చేసిన ఆరోపణలపై స్పందించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆవేశం తగ్గించుకోవాలని ముస్తఫాకు సూచించిన ఆయన.. అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని చెప్పి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాక.. ముస్తఫా మిగతావారిపై విమర్శలు చేస్తున్నారని.. తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.
ముస్తఫాకు.. మేయర్ కావటి మనోహర్‌నాయుడుతో సఖ్యత లేదు. ముస్తఫా చేస్తున్న హడావుడిపై స్పందించిన గుంటూరు మేయర్.. తూర్పు నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరితోనూ ముస్తాఫాకు విభేదాలున్నాయి. ఇటీవల.. వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ పాలక మండలిని.. గిరితో సంప్రదించకుండా నియమించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఆలయ వ్యవహారంలో.. తనను కనీసం మాట అడగకపోవడం గిరికి ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఆయన వర్గీయులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన ముస్తఫా చేసినట్లు సమాచారం. అందుకే ఐ ప్యాక్ బృందం.. ఈ నెల 23న జరిగిన కౌన్సిల్ సమావేశానికి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.