సేంద్రియ ఉత్పత్తులకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి తెలిపారు. అత్తలూరుపాలెం ఆర్గానిక్ కంపెనీ గుంటూరులో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల విక్రయశాలను ఆయన ప్రారంభించారు.
రోగనిరోధక శక్తిని పెంచటంలో సేంద్రియ ఆహారం కీలకమని... ప్రస్తుతం కరోనా సమయంలో ఇలాంటి ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని తెలిపారు. రైతులే సంఘటితంగా ఏర్పడి...ఆర్గానిక్ కూరగాయలు, ఇతర పంటలు పండించి... సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. వారికి శాఖాపరంగా ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు.
గతేడాది 10వేల ఎకరాల్లో మిర్చి పంటను సేంద్రియ విధానంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించినట్లు చెప్పారు. వాణిజ్య పంటలు వేసి నష్టపోతున్న రైతులను క్రమంగా కూరగాయలు, ఇతర చిరుధాన్యాల సాగు వైపు మళ్లించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రెండు గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఈ విధానంలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా అత్తలూరులోనే ఏర్పాటు చేస్తామని... అందుకు సహకరించేందుకు ఉద్యానశాఖ ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో 50 కేంద్రాలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి
బాబాయ్ కోసం ప్రార్థించిన అందరికి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు