ORDINANCE ON AP EMPLOYEES AGE RELAXATION: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై రాష్ట్ర సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ.. ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. 1984లో ఒకసారి, 2014లో ఒకసారి పదవీ విరమణ వయసు చట్టాన్ని సవరించారు. 2.6.2014 నుంచి 60 సంవత్సరాలుగా ఉంది. పదవీ విరమణ వయసు పెంచేందుకు గల కారణాలను ఆర్డినెన్స్‌లో వివరించారు.
- 2014తో పోలిస్తే సగటు జీవితకాలంలో మెరుగుదల ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో ప్రాపంచిక సగటు జీవిత కాలం 73 సంవత్సరాలు. భారతీయుల సగటు జీవిత కాలం 70 సంవత్సరాలు. పైగా సాధారణ ఆరోగ్య పరిస్థితులూ మెరుగయ్యాయి.
- సీనియర్ ఉద్యోగుల అనుభవ నైపుణ్యం వినియోగించుకునేందుకు పెరిగిన జీవితకాలం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించాం.
- చట్ట సభలు ఇప్పుడు సమావేశమై లేనందున ఆర్డినెన్సు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెంపు ఉత్తర్వుల విడుదల: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జీవో 15 విడుదల చేశారు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్సు జారీ చేసిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్న వారి సందిగ్ధానికి తెరపడింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి..
CM Jagan: ఉపాధి హామీ పనుల్లో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం జగన్