దళారుల దోపిడీలను నియంత్రించేందుకు రైతుకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ప్రధాని మోదీ నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ధరల హామీ ఒప్పందం, రవాణా సౌకర్యాల చట్టాలు వ్యవసాయానికి ఊతమిస్తాయని ఆయన వివరించారు.
కీలక మలుపు..
వ్యవసాయ రంగ చరిత్రలోనే ఈ చట్టాలు కీలక మలుపు తెస్తాయన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, దళారుల కబంధ హస్తాల నుంచి రైతులను రక్షించడం నూతన వ్యవసాయ చట్టం లక్ష్యమన్నారు. రైతు నేరుగా పంటను అమ్ముకునే వెసులుబాటు చట్టం కల్పిస్తుందని పేర్కొన్నారు.
రెండు రెట్ల రెట్టింపు మద్దతు..
పంటను ముందుగానే అమ్ముకునే విధానం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రెండున్నర రెట్లు మద్దతు ధరను పెంచిన ఘనత ప్రధాని మోదీకే చెందుతున్నారు. వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ అబద్దాలు చెప్పి రైతులను తప్పు దారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టడం సరైంది కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఇప్పటికైనా అబద్దపు ప్రచారాలు మానుకోవాలన్నారు.