Nara Lokesh Pawan Responded on Fishing Harbor Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు స్పందిస్తూ.. ప్రమాదం సంభవించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనాని పవన్ ఘటనపై స్పందిస్తూ.. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన నారా లోకేశ్: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో బోట్లు.. కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్‌లో భద్రతా చర్యల అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులేనని లోకేశ్ అన్నారు.
ప్రభుత్వం స్పందించి బాధితులకు నూతనంగా బోట్లను, పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 40 బోట్లు
ఆవేదన వ్యక్తం చేసిన అచ్చెన్న: ఫిషింగ్ హార్బర్లోని అగ్ని ప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే ప్రధాన కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్న కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు.
విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని.. వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రతపై పెట్టాలని హితవు పలికారు. అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోందని.. బోట్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కొత్త బోట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. మరోమారు అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలను ఏర్పాటు చేయాలని సూచించారు.
బోట్ల యాజమానులను ఆదుకోవాలన్న జనసేనాని: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోట్ల యజమానులను ఆదుకోవాలని ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టి.. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలని పవన్ డిమాండ్ చేశారు.
ఛఠ్ పూజ వేళ కాల్పుల కలకలం- ఆ కుటుంబమే టార్గెట్- ఇద్దరు మృతి