TDP Leaders Comments on Volunteers: వాలంటీర్లపై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా డేటా సేకరణను తప్పుబట్టారు. ఇది రాజ్యాగం వ్యతిరేకమని అన్నారు. అదే విధంగా మరో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు సైతం వాలంటీర్ వ్యవస్థపై.. తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలియజేశారు. కొంతమంది వాలంటీర్ల వలన.. వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు.
ఎవరైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి: వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నదే తెలుగుదేశం విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా డేటా సేకరణ ఉదంతం వెలుగు చూసిందని తెలిపారు. వాలంటీర్లైనా, మరెవరైనా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని లోకేశ్ తెలిపారు.
ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండగా, వాలంటీర్ల ద్వారా మళ్లీ సమాచార సేకరణ దేనికని నిలదీశారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచార సేకరణ చట్ట విరుద్ధమన్నారు. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లగా ఉద్యోగాలు కల్పించామని విజయసాయి రెడ్డే బహిరంగంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల గురించి సజ్జలనే అడగాలన్నారు. ముందస్తుకు వెళ్లాలంటే ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా అని నారా లోకేశ్ నిలదీశారు.
"కొన్ని నియోజకవర్గాల్లో.. చాలా వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారు. సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు. దాని వెనక ఏం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థని రాజకీయంగా వాడుకోకూడదు. వాళ్ల పార్టీ నేతలే చెబుతున్నారు.. వీరంతా మా కార్యకర్తలు అని.. అది కరెక్ట్ కాదు". - నారా లోకేశ్, తెలగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు కామెంట్స్: వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను, కొందరు వాలంటీర్లు హద్దులు మీరిన ప్రవర్తించడాన్నే తాము తప్పుపడుతున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. వాలంటీర్లను తమ స్వార్థానికి వాడుకుంటున్న ప్రభుత్వాన్ని, వైసీపీ నేతల్ని నిలదీస్తున్నామన్నారు. కొందరు వాలంటీర్లు చేసే తప్పులకు మొత్తం వ్యవస్థే తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు.
వాలంటీర్లు ప్రజాసేవకులు.. అదో గొప్ప వ్యవస్థ అని చెప్పుకునే ముఖ్యమంత్రి.. వారి బాధలు, సమస్యలు, ఇబ్బందులను ఎందుకు పరిష్కరించరని నిలదీశారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపుల నుంచి వాలంటీర్లను ఎందుకు కాపాడరని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం సమర్థవంతంగా, సక్రమంగా పనిచేసేలా వాలంటీర్లను తీర్చిదిద్దుతామన్నారు. వేధింపులు, పని ఒత్తిడి లేకుండా ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా సేవలందించే నూతన వ్యవస్థగా మారుస్తామని నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.