Nadu Nedu Program in Health Department: వైద్య రంగంలో ‘నాడు-నేడు’లో భాగంగా చేపట్టే నిర్మాణాల్లో రాజీ పడొద్దని సర్కారు ఆసుపత్రుల్లోకి వెళ్తే, కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చిన భావన రోగులకు కలగాలంటూ 2020 సెప్టెంబరు 30న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు. మూడేళ్లలో అన్ని ఆసుపత్రుల నిర్మాణలూ పూర్తి చేయడమే కాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మార్చేయాలంటూ పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాటలకు మూడేళ్లు అయిపోయాయు. కానీ చెప్పేందేదీ జరగలేదు.
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కార్పొరేట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దాలని జగన్ చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆసుపత్రుల రూపురేఖలు మారడం దేవుడెరుగు వైద్యం కోసం వెళ్లే వారికి ఆసుపత్రుల్లో తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి. ‘నాడు-నేడు’ కింద చేపట్టిన పనులు మూడు సంవత్సరాలు దాటినా ఇంకా పూర్తి కాలేదు.
Andhra Pradesh Govt Negligence on Hospitals: ‘నాడు-నేడు’ కింద 8 వేల 534 ఉప ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి విలేజ్ హెల్త్ క్లినిక్స్ పేరిట రాష్ట్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత పనుల కోసం విడతల వారీగా 708 కోట్లు కేటాయించింది. నిధులు విడుదలై రెండు మూడేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 150 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను చేపట్టగా.. వీటిలో ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం 95 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా వాటిలో పనులన్నీ దాదాపు పడకేశాయి. మొత్తం 454 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా ప్రభుత్వం ఇప్పటివరకూ 250 కోట్లే విడుదల చేసింది. సుమారు 75 ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల నిర్మాణాల విషయంలో అడుగులు ముందుకు పడటం లేదు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 12, శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో ఏడు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు చొప్పున ఆసుపత్రుల్లో నిర్మాణాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు ఉన్నాయి. దాంతో ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు వాటి అప్పగింత జరగలేదు. నిర్మాణాలు ముందుకు సాగకపోవడానికి గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్నీ ఒక కారణంగా చెప్పాలి. కొన్నిచోట్ల స్థల సమస్యలు, కేటాయింపులో మారిన నిర్ణయం, ఇతరత్రా కారణాల వల్ల ఉప, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల పనులు తాబేలు నడకతో పోటీపడుతున్నాయి.
ఉద్యోగులే అద్దె చెల్లిస్తున్న పరిస్థితి: నాడు-నేడు కింద గతేడాది వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల నిర్మాణాల తీరు పట్ల ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ బృందాలూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు గమనించిన ఆసుపత్రుల్లో నిర్మాణాల్లో 15 శాతం కన్నా తక్కువే పూర్తయినట్లు వారు పేర్కొన్నారు. వీటి ద్వారా రోగులకు అందే సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్మాణాలు పూర్తికాక కొన్నిచోట్ల ఉప ఆరోగ్య కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి అద్దె కట్టడం లేదు. కమ్యూనిటీ హెల్త్ అధికారులే తమ వేతనం నుంచి చెల్లిస్తున్నారు.
చాలాచోట్ల స్లాబు దశలోనే: ‘మీరు కట్టొద్దు.. మేమే చెల్లిస్తాం’ అంటూ సమీక్షల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు కానీ నిధులివ్వడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో 70 శాతం వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిల్లో సౌకర్యాల మాట సరేసరి. మూడు సంవత్సరాలు కిందట ప్రారంభించిన పనులు చాలాచోట్ల స్లాబు దశలోనే నిలిచాయి. పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడే పూర్తయ్యాయి. 4 భవనాల నిర్మాణాలకు టెండర్లే దాఖలు కాలేదు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 52 ఆరోగ్య ఉప కేంద్రాలకు నాలుగు మాత్రమే పూర్తి అయ్యాయి.
పాత చింతలపూడిలో నిధుల్లేక పునాది దశలో విలేజ్ క్లినిక్ భవనం పనులు ఆగిపోయాయి. నూజివీడు డివిజన్ పరిధిలో 37కు 12 నిర్మాణాలే పూర్తయ్యాయి. ఏలూరు జిల్లా కలిదిండి, పాలకొల్లు నియోజకవర్గం లంకలకోడేరు పీహెచ్‌సీల నిర్మాణ పనులను 2020, 2022లో ప్రారంభించగా ఇప్పటికీ పూర్తి కాలేదు. తాడేపల్లిగూడెం ప్రాంతీయాసుపత్రి పేరుకే వంద పడకలైనా.. అందుకు తగిన సేవలు మాత్రం అందడం లేదు. ఇక్కడి అత్యాధునిక వైద్య పరికరాలు మూలకు చేరాయి.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజనల్ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్, ఫార్మసీ విభాగాలను ఆనుకొనే మరుగుదొడ్లు ఉన్నాయి. రెండేళ్ల కిందట వ్యర్థాలు బయటకెళ్లే వ్యవస్థ దెబ్బతినడంతో వాటికి తాళాలు వేశారు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా విపత్తుకు ముందు ఆసుపత్రి ప్రాంగణంలో ఓపీ విభాగం నిర్వహణకు ఓ భవనాన్ని నిర్మించారు. తర్వాత దానికి తాళాలు వేసేయడంతో నిరుపయోగంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలోని కేంద్రం నిర్మాణ పనులు ప్రాథమిక దశలోనే నిలిచాయి.
చొరవ చూపని అధికారులు: చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం ముడిపాపనపల్లె పీహెచ్‌సీ 24 గంటల వైద్యశాలగా ప్రభుత్వం ప్రకటించింది. తాగునీటి వాటర్ ఫిల్టర్ మరమ్మతులకు గురైంది. రోగులకు నీరు దొరకదు అదనంగా నిర్మించిన మరుగుదొడ్డిలో ఏ సౌకర్యమూ కల్పించలేదు. మందులను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా గది లేకపోవడంతో వేర్వేరు చోట్ల సర్దుతున్నారు. కాన్పు కోసం తగిన వసతులు లేవు. వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె కొత్తగా రెండో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్ణయించింది. దీనికి ఎకరా స్థలం ఇచ్చేందుకు స్థానిక పారిశ్రామికవేత్త ముందుకొచ్చినా అధికారులు చొరవ చూపలేదు.
GGH Sanitation: పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందుల్లో రోగులు