MURDER: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత మార్చిన సంఘటన సోమవారం రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట చిత్రాలయ సెంటర్లో జరిగింది. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం ఇస్లాంపేటలో ఉంటున్న షేక్ అల్లాఖసం చిత్రాలయ సెంటర్లో కూర్చోని ఉండగా ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో నరికి తలపై రాళ్లతో మోదటంతో అల్లాఖసం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దుండగులు కత్తులు అక్కడే పడేసి పరారయ్యారు.
ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన సుభాని ఈ ఏడాది అక్టోబర్ 13న హత్యకు గురయ్యారు. ఆ కేసులో అరెస్టైన అల్లాఖసం జైలుకు వెళ్లి గత నెలలో బెయిల్పై బయటకు వచ్చాడు. ఎస్ఆర్కేటీ కాలనీలో జరిగిన పలు కేసుల్లో ఇతను నిందితుడు. హత్య సమాచారం అందటంతో డీఎస్పీ విజయభాస్కర్, సీఐ వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో యువకుడి బహిరంగ హత్య పట్టణంలో కలకలం రేపింది. కోటప్పకొండ రోడ్డులో ఘటన జరగటంతో అటుగా వెళ్లే ప్రజలు భయందోళనకు గురయ్యారు. మృతుడు గతంలో ఎస్ఆర్కేటీ కాలనీలో ఉండేవాడు. ప్రస్తుతం ఇస్లాంపేటలో ఉంటున్నాడు. అల్లాఖసం హత్యలో గతంలో హత్యకు గురైన సుభాని కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. సుభాని తల్లి మరో ముగ్గురితో కలిసి హత్య చేయించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు. హత్యతో ప్రమేయం ఉన్న అందరినీ త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: