MUNICIPAL OFFICERS DEMOLISH THE HOUSES IN GUNTUR: గుంటూరు నడిబొడ్డున ఉన్న శ్రీనగర్‌కాలనీలో రహదారి విస్తరణ పేరిట నగరపాలక సంస్థ సిబ్బంది పెద్దఎత్తున కూల్చివేతలకు పాల్పడింది. బీ-ఫారం భూముల్లో దాదాపు 4 దశాబ్దాల నుంచి ఉన్న ఇళ్లను ఉన్నపళంగా కూల్చివేశారు. పదుల సంఖ్యలో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లను సైతం నేలమట్టం చేశారు. తనకు వేరే ఆధారం లేదంటూ ఓ వృద్ధురాలు వేడుకున్నా కనికరించలేదు. దీంతో ఆవేదన చెందిన ఆమె ఇంటిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ జేసీబీ తొట్టెలో కూర్చుని నిరసన తెలిపింది.
2015లో కృష్ణ పుష్కరాల సందర్భంగా అప్పటి ప్రభుత్వం శ్రీనగర్ కాలనీలో రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టింది. స్థానికులకు నోటీసులు జారీ చేయడమేగాక.. బీ-ఫారం భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సైతం పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. కొందరికి బాండ్లు సైతం ఇచ్చింది. ఆ తర్వాత వివిధ కారణాలతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోగా.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా అధికారులు కూల్చివేతలు చేపట్టడమేగాక.. నాటి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం హామీపై మాత్రం నోరుమెదపడం లేదని బాధితులు బావురుమన్నారు.
పరిహారం వ్యవహారంలోనూ వివక్ష చూపుతున్నారని బాధితులు వాపోతున్నారు. కొందరికి పరిహారం చెల్లించిన అధికారులు.. మరికొందరికి మొండిచెయ్యి చూపుతున్నారని ఆరోపించారు. ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేతలు చేపట్టడంతో గూడు కోల్పోయి రోడ్డునపడ్డామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: