ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో హైడ్రామా కొనసాగుతోంది. భారీ బందోబస్తు భద్రతల నడుమ ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జీజీహెచ్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామకృష్ణరాజు గాయాలపై నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు ఇచ్చింది. అక్కడి నుంచి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసెంజర్ ద్వారా నివేదికను జిల్లా కోర్టు పంపింది. హైకోర్టులో రఘురామ కేసుపై వాదనలు జరిగాయి. ఈ నివేదికలో ఉన్న అంశాలపైనే.. అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు రఘురామను జైలుకు తరలించడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
భారీ బందోబస్తు నడుమ..
ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్ వెనక గేటు నుంచి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా జైలుకు తరలించారు. నిన్న 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు.. రఘురామను జీజీహెచ్, రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని.. రిపోర్టులు తమకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. రాత్రంతా జీజీహెచ్ లో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తర్వాత రమేష్ ఆసుపత్రిలో చేరుస్తారని భావించారు. అయితే ఒక్కసారిగా పోలీసులు ఎంపీని జిల్లా జైలుకు తరలించడంతో రఘురామ బంధువులు, అభిమానులు ఆందోళన చెందారు. ఆయన్ను జైలుకు చేర్చడంలో అడ్డంకులు లేకుండా ఉండేందుకు గుంటూరు జిల్లా కారాగారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గట్టి బందోబస్తు నిర్వహించారు.
నివేదిక సిద్ధం
రఘురామకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చింది. జీజీహెచ్‌లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన బోర్డు.. నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో మెడికల్ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియని కారణంగా.. జాప్యం జరిగింది.
2 రోజుల క్రితం...
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామను రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కింది కోర్టుకు వెళ్లమని ఉన్నత న్యాయస్థానం సూచించింది. జిల్లా కోర్టు ఈనెల 28 వరకు రిమాండ్ విధించడంతో.. ఎంపీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామ కేసులో రోజంతా హైడ్రామా.. గాయాలపై హైకోర్టు ఆగ్రహం