గుంటూరు మిర్చి ధరలపై కరోనా ప్రభావం పడింది. లాక్ డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభమైనా... ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించటం లేదు. కరోనా వ్యాప్తితో యార్డులో కార్యకలాపాలను అధికారులు నియంత్రించారు. తగిన జాగ్రత్తలతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
గుంటూరు మిర్చి యార్డులో పనిచేసే ఓ హమాలీకి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యార్డును గత వారం రోజుల పాటు మూసివేశారు. అన్ని రకాల పారిశుధ్య చర్యలు చేపట్టి ఇవాళ తిరిగి యార్డును తెరచారు. అయితే సరకు మాత్రం తక్కువగా వచ్చింది. సాధారణ రోజుల్లో లక్షన్నర టిక్కీల మేర బస్తాలు యార్డుకు వచ్చేవి. అయితే ఇవాళ కేవలం 20వేల బస్తాలు మాత్రమే వచ్చాయి. లాక్ డౌన్ ఆంక్షలు తొలగినా.. వేర్వేరు కారణాలతో సరకు తక్కువగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా యార్డు లేకపోవటంతో రైతులు మిర్చి పంటను శీతల గిడ్డంగుల్లో దాచి ఉంచారు. అక్కడ పనిచేసే కార్మికులు బీహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. వారు లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కార్మికులు లేకపోవటంతో సరుకు బయటకు తీసి అమ్మే పరిస్థితి లేదు.
"ఇక్కడ పనిచేసే హమాలీకి కరోనా రావటంతో అధికారుల ఆదేశాల మేరకు మార్కెట్ యార్డుని మూసేసాం. యార్డు మొత్తం శుద్ధి చేసి ఇవాళే తెరిచాం. అయినా సరుకు అనుకున్నంతగా రాలేదు. యార్డుకు వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి. అన్ని జాగ్రత్తలు తీసుకుని యార్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. మిర్చియార్డులో గతంలో పోలిస్తే లావాదేవీలు చాలావరకూ తగ్గాయి." - వెంకటేశ్వరరెడ్డి, మిర్చియార్డు కార్యదర్శి
"రైతులు కరోనాతో తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ లేకపోవటంతో అందరూ గిడ్డంగుల్లో దాచి ఉంచారు. ఇపుడు రేటు వస్తుందని భావించారు. కానీ రేటు పెరగలేదు. తేజ రకం కూడా 14వేల 500 మాత్రమే ఉంది. యార్డు తెరచి ఉంచితే ఎంతో కొంతకు సరకు అమ్ముకుంటారు. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది"- శ్రీనివాసరెడ్డి, వ్యాపారి
"మార్కెట్ కు వచ్చే సరకు తగ్గిపోయింది. శీతల గిడ్డంగుల్లో సరకు తీసే పరిస్థితి లేదు. విదేశాలకు ఎగుమతులు ప్రారంభమైతే అక్కడి సరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మిర్చి ధర పెద్ద ఆశాజనకంగా లేదు." - వెంకట రమణ, కమిషన్ ఏజెంట్.
-
ఇదీ చదవండి: