Minister Dharmana Prasada Rao: మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. దీనికి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో వివిధ సమస్యల్లో ఉన్న భూములను వినియోగంలోకి తెచ్చేందుకే ఈ మార్పులు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉద్యోగులను నియమించి సర్వే చేయిస్తున్నాం. గతంలో చుక్కల భూముల పేరుతో ప్రజలకు హక్కులు కల్పించకుండా తాత్సారం జరిగింది. ఇప్పుడు కాలపరిమితి విధించి పని చేయిస్తున్నాం. ఎసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీ ఒక నివేదిక తయారు చేసింది.
ఇప్పటివరకు ఎసైన్డ్ భూములను విక్రయించే అధికారం లేదు. అంతకుమించిన సమర్థనీయ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి సమర్పించి అందులోని మంచి అంశాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నాం. పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతే ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.సాయిప్రసాద్, అదనపు కమిషనర్ ఇంతియాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్ రామకృష్ణ, సర్వే సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్సు కమిషనర్ సిద్ధార్థజైన్‌లు పాల్గొన్నారు.