పైసా.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రాణాలు పోవడానికైనా..నిలపడానికైనా.. బంధాలు.. బంధుత్వాలు.. తెగిపోవడానికైనా. గుంటూరులో అదే జరిగింది వంద రూపాయలు తెచ్చిన తంటా ఏకంగా ప్రాణాలు పొగొట్టింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. అసలు విషయం ఏంటంటే. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి రాజాసాహెబ్, సైదాబీ.. ఆరు నెలల కిందట పని నిమిత్తం వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
వారి కుమార్తె నాగుల్బీని గుంటూరుకు చెందిన బంధువు మస్తాన్వలికి ఇచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రైతుబజార్లో మస్తాన్వలి కూలి పనులు చేస్తుంటాడు. ఈ నెల 12న కూలి డబ్బులు తెచ్చి భార్య నాగుల్బీకి ఇచ్చాడు. కాసేపయ్యాక ఏదో పని ఉండి డబ్బులు తీశాడు. అందులో 100 రూపాయలు తక్కువగా ఉంది. డబ్బులు ఏం చేశావంటూ భార్యను నిలదీయగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
తీవ్ర మనస్తాపానికి గురైన నాగుల్బీ... ఆదివారం ఉదయం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. మస్తాన్వలీ వెంటనే భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించిన కారణంగా.. ఆసుపత్రిలో నాగుల్బీ మృతి చెందింది. మృతురాలి తల్లి సైదాబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: